టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. ఈ మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. అందులో మళయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2, తమిళంలో ధనుష్ చేసిన అసురన్ రీమేక్ నారప్ప, మూడోది ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమాలు ఉన్నాయి. ఇందులో నారప్ప, దృశ్యం 2 షూటింగ్ పూర్తి కాగా.. ఎఫ్ 3 షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది. అయితే డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇటీవలే ఆయన కోలుకోవడంతో షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇంత వేగంగా ఓ సీనియర్ హీరో సినిమాలు తీయడం గ్రేట్ అనే చెప్పాలి. దీనిని బట్టి చూస్తే టాలీవుడ్‌లోని మిగతా సీనియర్ హీరోలతో పోల్చితే వెంకీ సూపర్ స్పీడ్‌లో ఉన్నాడనడంలో అనుమానం లేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మళయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం కథలో మార్పులు, కాస్టింగ్‌పై చర్చ జరుగుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కథపై కసరత్తు జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఎవరూ కూడా వెంకీలా ఒకేసారి 3 సినిమాలు చేయడం లేదన్నమాట. అంటే తన టైం హీరోలతో పోల్చితే వెంకీ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నాడన్నమాట.

 ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు సినిమాలకు తోడు వెంకీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఆ సినిమా కథేంటి..? డైరెక్టర్ ఎవరు..? ఇంకా తెలియాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో కథా చర్చలు పూర్తవుతాయని, క్యాస్టింగ్ పనులు కూడా మొదలవుతాయని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం.

అంతేకాదు.. వెంకీ చేయబోతున్న మూడు సినిమాలూ కేవలం నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. అయితే ఎఫ్ 3 షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో ఆ సినిమా చివర్లో రిలీజ్ కానుంది. కానీ మిగిలిన రెండు చిత్రాల్లో ఏది ముందు విడుదల అవుతుంది..? ఏది సెకండ్ రిలీజ్ అవుతుందో తెలియాలి. ఏది ఏమైనా ఈ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో..! ఎంత రచ్చ చేస్తాయో..!!  తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: