
సినియర్ నిర్మాత ఏం రత్నం చూస్తే ఎవరికి అయినా అయ్యో పాపం అనిపిస్తుంది. ఎలాంటి అద్భుతమైన సినిమాలు తీసిన నిర్మాత. ఈ వయసులో కూడా ఓ సినిమాను ఎలాగైనా థియేటర్లలోకి తేవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు.. ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. ఎవరి సహకారం లేదు అలా అనటం కన్నా ఆయన ఆశించడం లేదు అని చెప్పాలి. అన్నీ తానే రోజుకి 20 గంటలు కష్టపడుతూ హరిహర వీరమల్లు సినిమాను అనుకున్న టైం కు థియేటర్లలోకి తీసుకురావడానికి కింద మీద పడుతున్నారు. అసలు ఈ సినిమా భారీ అంచనాలతో ప్రారంభమైంది. క్రిష్ దర్శకుడు.. కీరవాణి సంగీతం, తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో, నిధి అగర్వాల్ హీరోయిన్.. పైగా జానపద, చారిత్రాత్మక సినిమా. ఇంతకన్నా గొప్ప కాంబినేషన్ ఏం కావాలి. అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టు అనుకున్న టైంలో రెడీ అయి ఉంటే ఈరోజు థియేటర్ల మార్కెట్ ఊగిపోతూ ఉండాలి. సినిమా మాకు కావాలి మాకు కావాలి అని పోటీ పడేవారు. నిర్మాత రత్నం చుట్టూ బయ్యర్లు , డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు ముగిపోయి ఉండేవారు కానీ అలా జరగలేదు.
సినిమా నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది. దర్శకుడు సగంలో తప్పుకున్నారు. ఆ తర్వాత కథ మారిందని ప్రచారం జరిగింది. అయినా నిర్మాత రత్నం వెనక్కు తగ్గలేదు. తన కొడుకు జ్యోతి కృష్ణతో కలిసి అనేక కష్టనష్టాలకు తట్టుకుని మరి సినిమాను రెడీ చేశారు. కాపీ రెడీ కావాలి .. ఇంకా పదిరోజుల సమయం మాత్రమే ఉంది. ఓవర్సీస్ కాపిలు పంపటానికి మహా అయితే మరో రెండు మూడు రోజులు సమయం ఉంది. ట్రైలర్ కట్ చేసి వదలాలి .. ఇంకా సెకండ్ హాఫ్ సీజీ వర్క్ రావాల్సి ఉంది. ఇవన్నీ తండ్రి కొడుకులు కింద మీద పడుతూ చూసుకుంటున్నారు. సినిమా మార్కెట్ ఇంకా పెండింగ్లో ఉంది. అదను చూసి బయ్యర్లు చాలా తక్కువ రేట్లకు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయితే అప్పుడు మంచి రేటు వస్తుంది అని నిర్మాత ఆశిస్తున్నారు. దీనికి తోడు సినిమా ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడంతో వడ్డీలు భారీగా పెరిగాయని మన దగ్గర ఉండే ఫైనాన్షియర్లు కాస్త వడ్డీ తగ్గించుకుంటారు ఏమోగానీ ... ముంబై కార్పొరేట్ ఫైనాన్సియర్లు అలా కాదు ..! వారికి రిలీజ్ కు ముందు అణా పైసలతో సహా అన్ని కట్టాలి. ఓటిటి డీల్స్ జరిగిన ఆ డబ్బులు ఇప్పుడు రావు. సినిమా విడుదలైన నెలల తర్వాత వస్తాయి. ఇలా ఎన్ని కష్టాల మధ్యలో వస్తున్న హరిహర వీరమల్లు సక్సెస్ అయితే రత్నం కష్టానికి తగిన ఫలితం వస్తుంది.