టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఏఎస్ రవికుమార్ చౌదరి క‌న్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న తుది శ్వాస విడిచారు. `యజ్ఞం` మూవీతో ద‌ర్శ‌కుడిగా మారిన ఏఎస్ ర‌వికుమార్‌.. తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌తో `వీరభద్ర`, నితిన్ తో `ఆటాడిస్తా`, త‌నీష్ తో `ఏం పిల్లో ఏం పిల్లడో`, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో `పిల్లా నువ్వు లేని జీవితం` త‌ద‌త‌ర చిత్రాలను తెర‌కెక్కించారు. అయితే ఏఎస్ ర‌వి కుమార్ కెరీర్‌లో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డాయి. చివ‌రిగా `తిరగబడరా సామి`తో ఆయ‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న‌ప్ప‌టికీ.. నిరాశే ఎదురైంది. వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణంగా ఏఎస్ ర‌వి కుమార్ ఫేడౌట్ అయ్యారు.


ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఏఎస్ రవి కుమార్ దూకుడు స్వ‌భావం క‌లిగిన‌ వ్య‌క్తి. నోటి దురుసు వ‌ల్ల ప‌లు వివాదాల్లో కూడా ఆయ‌న చిక్కుకున్నారు. ముఖ్యంగా తిరగబడరా సామి మూవీ ఈవెంట్ లో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ను ఏఎస్ రవి కుమార్ ప‌చ్చి బూతులు తిడుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అప్ప‌ట్లో ఆయ‌న వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అస‌లు గొడ‌వేంటంటే.. గోపీచంద్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత విల‌న్ గా ట‌ర్న్ తీసుకుని ప‌లు చిత్రాలు చేశారు. అటువంటి స‌మ‌యంలో `యజ్ఞం` చిత్రంతో గోపీచంద్ కు హీరోగా బ్రేక్ ఇచ్చాడు ఏఎస్ రవికుమార్. ఆ దెబ్బ‌తో గోపీచంద్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.


ఇటు ఏఎస్ ర‌వికుమార్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగింది. బాల‌య్య‌తో `వీరభద్ర` వంటి ఫ్లాప్ అనంత‌రం `రారాజు`(2006) షూటింగ్ లో గోపీచంద్ ను మీట్ అయ్యాడు ఏఎస్ ర‌వికుమార్‌. ఇలా ఫ్లాపుల్లో ఉన్నా, మ‌ళ్లీ మ‌నం క‌లిసి ఒక సినిమా చేద్దామ‌ని ర‌వికుమార్ అడ‌గ్గా.. అందుకు గోపీచంద్ `మంచి క‌థ రెడీ చేసి రండి చుద్దాంలే` అన్నాడ‌ట‌. ఆ త‌ర్వాత గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ను లైన్‌లో పెట్ట‌డంతో ఏఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చాలా ఏళ్ల పాటు సినిమా చేయ‌లేక‌పోయారు.


ఇది మ‌న‌సులో పెట్టుకున్న ఏఎస్ ర‌వికుమార్.. తిరగబడరా సామి మూవీ ఈవెంట్ లో గోపీచంద్ పేరు ఎత్త‌కుండానే దూషించారు. `ఒరేయ్ అంత బలిసిందా రా? ఒకప్పుడు నా ఫ్యామిలీలో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరికి నేను రావాలంటే ఐదుగురిని దాటుకుని రావాలా? విలన్ గా నటించేవాడ్ని నేనే హీరో చేశా. ఆ సినిమా(యజ్ఞం)కు నేను తీసుకున్న‌ రెమ్యునరేషన్ క‌న్నా వాడికే త‌క్కువ‌. నా సినిమాతో హీరోగా ఎదిగి.. న‌న్నే దూరం పెడ‌తావా?` అంటూ ఏఎస్ ర‌వికుమార్ ప‌రోక్షంగా గోపీచంద్ ను ఘోరంగా అవ‌మానించారు.


ఈ ఇష్యూపై గోపీచంద్ ఏం రియాక్ట్ కాక‌పోయినా.. ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఏఎస్ ర‌వికుమార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దాంతో త‌ప్పు తెలుసుకున్న డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ క్షమాపణలు తెలియజేశారు. గోపీచంద్ తనకు బిడ్డలాంటి వాడు.. అత‌ని గురించి అలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు. త‌ప్పు చేశానంటూ ఆయ‌న పశ్చాత్తాప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: