
నాటకాల ద్వారా నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట.. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 750 కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలను పోషించి విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచారు. తెలుగులో దాదాపు హీరోలందరితో తెరపంచుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, కోటా శ్రీనివాసరావు.. ఈ ఇద్దరికీ ఒక కామన్ లింక్ ఉంది. బహుశా చాలా మందికి అదేంటో తెలియదు.
ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి, కోటా శ్రీనివాసరావు ఇద్దరూ ఒకే ఏడాది ఒకే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. నటనపై ఉన్న ఆసక్తితో చెన్నై వచ్చి యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న చిరంజీవి.. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి చివరకు 1978లో రిలీజ్ అయిన `ప్రాణం ఖరీదు` మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా గుర్తింపు పొందారు.
మరోవైపు కోటా కూడా ప్రాణం ఖరీదు సినిమాతోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో చిన్న వేషం వేశారాయన. ఆ సమయంలో కోటా బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రాణం ఖరీదు తర్వాత కోటా సినిమాలు కంటిన్యూ చేయకుండా తన జాబ్ చేసుకున్నారు. ఏకంగా 5 ఏళ్ళ గ్యాప్ తీసుకుని మళ్లీ 1983లో ఒక సినిమా చేసారు. ఇక 1985 నుంచి కోటా ఫుల్ టైమ్ నటుడిగా మారడం జరిగింది.