మన తెలుగు భాష సంపన్నమైనది, శ్రావ్యమైనది. కానీ తాజాగా డబ్బింగ్ సినిమాల ద్వారా మ‌న మీద వేరే భాషా టైటిళ్ల‌ని రుద్దే ప్రయత్నం బలంగా కనిపిస్తోంది. అసలు కథ ఏమిటంటే—ఇటీవలి కాలంలో తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన పలు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. కానీ టైటిల్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలాగే వదిలేస్తున్నారు. దీని వల్ల తెలుగు ప్రేక్షకులు అసలు అర్థం కూడా పట్టుకోలేని టైటిల్స్‌ను చూసి విసుగు చెందుతున్నారు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. తమిళ సినిమా రెట్టతల (రెండు తలలు అని అర్థం) తెలుగులో కూడా అలాగే వదిలేశారు. తెలుగు వారికి అది అర్థమయ్యే పేరు కాదు. మరొకటి మలయాళ సినిమా కొతలోక—దాని అర్థం ‘కొత్త లోకం’. తెలుగు ప్రేక్షకుల కోసం సింపుల్‌గా మార్చివేస్తే బాగుండేది. కానీ భాషాభిమానం పేరుతో అలాంటి మార్పు చేయడం లేదు.


ఇంకా షాకింగ్ ఉదాహరణ పూ* అనే టైటిల్. తమిళంలో దానికి ఏ అర్థమో కానీ, తెలుగులో మాత్రం పచ్చి బూతు. ఇలాంటి పేరుతో సినిమా వస్తే, ప్రేక్షకులు ఏ మొహం పెట్టుకుని థియేటర్‌కి వెళ్ళాలి ? అలాంటి టైటిల్స్‌తో సినిమాలు రావడం నిజంగా తెలుగు సంస్కృతిని అవమానించే పని. ఇటీవల ‘నరివెట్ట’, ‘తుడరమ్’, ‘పెండుళం’, ‘అగాథియా’, ‘వెట్టయాన్’, ‘ఎంపురన్’ లాంటి టైటిల్స్‌తో పలు సినిమాలు వచ్చాయి. కొన్నింటిని జనాలు ఆహా-ఓహో అని మెచ్చుకున్నా… టైటిల్ పరంగా మాత్రం అనుభూతి కలిగించలేదు. ఇది కొత్త ఫ్యాషన్ అని చెప్పాలి. గతంలో అయితే తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అర్థవంతమైన టైటిల్స్ వెదికి పెట్టేవారు. అవి సూపర్ హిట్ అయేవి కూడా.



అసలు భాషపై ఇంత అభిమానముంటే, డబ్బింగ్ ఎందుకు చేస్తున్నారు? తమ భాషలోనే రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా! కానీ మార్కెట్ కోసమే తెలుగులోకి తెస్తున్నారు. అలా అయితే తెలుగువారికి అర్థమయ్యేలా టైటిల్ మార్చకపోవడం ఏ న్యాయం? ఒక తెలుగు సినిమాను అదే పేరుతో తమిళంలో రిలీజ్ చేస్తే, వాళ్లు అంగీకరిస్తారా? అస్సలు కాదు. అయితే మనం ఎందుకు భరించాలి? ఈ పరిస్థితిని ఆపడానికి తెలుగు భాషాభిమానులు ముందుకు రావాలి. “తెలుగులో అర్థవంతమైన టైటిల్ పెట్టకపోతే సినిమాను బహిష్కరిస్తాం” అని కఠినంగా హెచ్చరించాలి. అప్పుడు కానీ ఈ పైత్యం తగ్గదు. లేకపోతే వచ్చే రోజుల్లో మరింత వింత టైటిల్స్ మనపై రుద్దబడతాయి. తెలుగు భాష గౌరవం కాపాడుకోవాలంటే, ఇలాంటి దుర్మార్గానికి గట్టి బహిష్కరణే సమాధానం!

మరింత సమాచారం తెలుసుకోండి: