- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు - రాజమౌళి సినిమా టైటిల్ చుట్టూ ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చే నడుస్తోంది. ‘వారణాసి’ అనే టైటిల్‌పై మొదటి నుంచి గాసిప్‌లు వస్తూనే ఉన్నా… రాజమౌళి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా, తన సినిమా టైటిల్‌గా ‘వారణాసి’నే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే టైటిల్‌ను ఇప్పటికే నిర్మాత సుబ్బారెడ్డి ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకోవడం, ఆయన తాజాగా పోస్టర్‌లూ విడుదల చేయడం ఇప్పుడు కొత్త రగడకు కారణమైంది.


సాధారణంగా ఏ సినిమా టైటిల్‌ని ప్రకటించే ముందు, ముఖ్యంగా భారీ స్థాయి ప్రాజెక్టుల విషయంలో, దర్శక - నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కథ, మార్కెట్, టైటిల్ ఆకర్షణతో పాటు, ఆ పేరు అందుబాటులో ఉందా? ఇప్పటికే వేరే బ్యాన‌ర్ తీసుకుందా ? అనే అంశాలను ఖచ్చితంగా చెక్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి టీమ్ నుండి అలాంటి జాగ్రత్తలు కనిపించలేదన్న భావన వెలువడుతోంది. ఇదే టైటిల్‌తో ఓ చిన్న నిర్మాత సినిమా తీస్తున్నాడని, పోస్టర్ కూడా బయటికి వచ్చిందని జక్కన్నకు నిజంగా తెలియదా? లేక తెలిసినా పట్టించుకోలేదా ? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.


అయితే ఫిల్మ్ ఛాంబర్‌లో సుబ్బారెడ్డి స్పష్టంగా  “ ఈ టైటిల్ నాది… నేను ఎవరికీ ఇవ్వలేదు ” అంటూ పట్టు వదలకుండా నిలబడుతున్నాడని సమాచారం. దీంతో రాజమౌళి టీమ్ ఇప్పుడు అతనితో సంప్రదింపులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా పరిశ్రమలో పెద్ద దర్శకుడు, ముఖ్యంగా రాజమౌళి వంటి వ్యక్తి కోరితే, చిన్న నిర్మాతలు టైటిల్ ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అవసరమైతే రాయల్టీ కూడా చెల్లించవచ్చు. కానీ ఈ సందర్భంలో సుబ్బారెడ్డి మొండి వైఖరి తీసుకుంటే పరిస్థితి కాస్త క్లిష్టంగా మారే అవకాశముంది. రాజమౌళి కొత్త టైటిల్ వెదకాల్సిన పరిస్థితి వస్తుందా? లేక సుబ్బారెడ్డితో సెటిల్ చేసుకుని ‘వారణాసి’ని సొంతం చేసుకుంటారా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ వివాదమే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: