నటీనటులు : దుల్కర్ సల్మాన్, పి. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి తదితరులు.
సినిమాటోగ్రాఫర్ : డాని సాంచెజ్-లోపెజ్
ఎడిటింగ్‌ : ఆంటోనీ
మ్యూజిక్‌ : ఝాను చంథర్, జేక్స్ బిజోయ్
నిర్మాతలు : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
దర్శక‌త్వం : సెల్వమణి సెల్వరాజ్
రిలీజ్ డేట్‌: 14 న‌వంబ‌ర్‌, 2025


ప‌రిచ‌యం :
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇటీవ‌ల దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాల‌కు తెలుగులో మంచి క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఉంది. ఈ క్ర‌మంలోనే కాంత సినిమాపై తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మంచి అంనాలు ఉన్నాయి. మ‌రి కాంతా మ‌న‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అయ్యిందో స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థ :
అయ్య(సముద్రఖని) ఓ సినిమా డైరెక్టర్ గా ఉంటాడు. ఈ క్ర‌మంలోనే ఓ అనాథ అయిన మ‌హదేవ‌న్ ( దుల్క‌ర్ స‌ల్మాన్‌)ను తాను తీసుకువ‌చ్చి సినిమా హీరోను చేస్తాడు. ఆ త‌ర్వాత మ‌హ‌దేవ‌న్ పెద్ద స్టార్ హీరో అయిపోతాడు. మ‌నోడికి తిరుగులేని క్రేజ్‌, ఫ్యాన్స్ స‌ర్కిల్ ఏర్ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు తాను పెద్ద స్టార్ హీరో అయిపోయాను అన్న అహంభావానికి వ‌చ్చేస్తాడు. ఈ క్ర‌మంలోనే తాను ఎంచుకునే క‌థ‌ల ఎంపిక‌లో మార్పు వ‌చ్చేస్తుంది. మంచి క‌థాబ‌లం ఉన్న సినిమాల కంటే త‌న‌కు చ‌ప్ప‌ట్లు కొట్టే అభిమానుల కోస‌మే సినిమాలు చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేస్తాడు. ఈ క్ర‌మంలోనే అయ్య ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకున్న శాంత క‌థ తో మ‌హ‌దేవ‌న్ హీరోగా ఓ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది. మ‌ధ్య‌లో ఆ షూటింగ్ ఆగిపోతుంది. చివ‌ర‌కు మ‌ళ్లీ ఆ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ సారి ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా ముందు అయ్య ప్రియ శిష్యురాలే .. ఆ త‌ర్వాత మ‌హ‌దేవ‌న్ వైపు వ‌చ్చేస్తుంది. ఈ టైంలో షూటింగ్‌లో ఆ టీంలో ఒక‌రు హ‌త్యకు గుర‌వుతారు. ఆ హ‌త్యను నువ్వంటే నువ్వు చేశావ‌ని ద‌ర్శ‌కుడు, హీరో ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకుంటూ ఉంటారు. ఆ హ‌త్య కేసు చేధించేందుకు ఇన్‌స్పెక్ట‌ర్ దేవ‌రాజ్ ( రానా ద‌గ్గుబాటి ) రంగంలోకి దిగుతాడు. ఇంత‌కు ఆ హ‌త్య కేసు ఏమైంది ? ఆ హ‌త్య చేసింది ఎవ‌రు ?  గ‌రు, శిష్యుల బంధాలు అంత‌గా తెగిపోవ‌డానికి కార‌ణం ఏంటి ?  హీరోయిన్ పాత్ర ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.


విశ్లేష‌ణ :
సినిమా నేపథ్యంలో తెర‌కెక్కే కథలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి మరో సినిమా కాంత తెరపై మనం చూస్తున్న సినిమాలు ఎంతగా రెక్తి కడుతూ ఉంటాయో ? అవి తెరకెక్కటం వెనక చోటుచేసుకునే సంఘటనలు అంతకుమించి ఆసక్తిగా ఉంటాయి. వీటి గురించి సినిమా పరిశ్రమంలో చాలా ఆసక్తిగా చెప్పుకుంటూ ఉంటారు. అవి బయటకు వస్తే మనకు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాంటి కొన్ని కథలు గుర్తుచేసే సినిమా కాంత. సినిమా రంగంలో గొప్పవాళ్ళు అయిన ఓ హీరో, దర్శ‌కుడు వారిద్దరి మధ్య విభేదాలు అహన్ని తెరపై ఆవిష్కరించిన సినిమా కాంత ఫస్ట్ అఫ్ అంత సినిమా నేపథ్యంలో సాగుతుంది. అది కూడా 1950 నాటికి సినీ ప్రపంచం.. ఆగిపోయిన సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. అప్పటి కాలాన్ని మళ్లీ కళ్ళ ముందుకు తీసుకువచ్చిన సీన్లు చూస్తుంటే మనం సినిమాలో లీనమైపోతాం. ఒకపక్క సినిమా సెట్ లో వాతావరణం గురుశిష్యుల బంధంతో పాటు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథని ఆవిష్కరిస్తూ సినిమా చక‌చ‌కా పరుగులు పెడుతుంది.


అయితే సినిమా నేపథ్యంలో సాగే సన్నివేశాలు లీనమైతే తప్ప ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరు. దర్శకుడు హీరో పోటీ పడుతూ చేసే సన్నివేశాలు సినిమాకే హైలైట్. అయితే ఓ హత్యతో కథ‌ అనూహ్యంగా మ‌లుపులు తిరుగుతుంది. సెకండాఫ్ అంతా ఆ హత్య కేసు పరిశోధన చుట్టూ సాగుతుంది. అప్పటిదాకా ఒక అద్భుతమైన అనుభూతి పంచిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతి పంచుతుంది. రానా దగ్గుబాటి రాకతో సన్నివేశాలలో సందడి పెరిగినా .. రానా చేసే ఇన్వెస్టిగేషన్ మాత్రం సుదీర్ఘంగా సాగుతుంది. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి గాడిన పడుతుంది. హత్య ఎవరు చేసారు ? ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న కారణాలు సినిమాకు గొప్ప మలుపు.


న‌టీన‌టులు & టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్ ఎన‌లైజింగ్ :
నటి చక్రవర్తి మహదేవ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవించారు. స్వర్ణ యుగం నాటి హీరోగా ఆయన కనిపించిన తీరు చాలా నేచురల్ గా ఉంది. అయ్య పాత్రలో దర్శకుడుగా సముద్రఖని కంటే ఆ పాత్ర గుర్తుండిపోతుంది. రెండు కోణాలలో సాగే పాత్రలో ఆయన రాజీపడిన దర్శకుడిగా చాలా బాగా మెప్పించారు. సెకండాఫ్ సినిమాకి రానా న‌ట‌న‌ ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే త‌న అభిన‌యంతో పాటు అందంతో ఆక‌ట్టుకుంది. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశం బాగా ఉప‌యోగించుకుంది. దుల్క‌ర్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఇన్‌స్పెక్ట‌ర్ గా రానాతో పాటు మిగిలిన న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల‌తో మెప్పించారు.


మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కొన్ని చోట్ల రొటీన్ స్క్రీన్ ప్లేతో సినిమాను న‌డిపించేశాడు. ఉత్కంఠ భ‌రిత‌మైన సీన్లు ఇంకా కొన్ని ప‌డి ఉంటే సినిమా రేంజ్ మారిపోయి ఉండేది. సీన్లు మాత్రం కొత్త‌గా ఉంటాయి. సినీ నేప‌థ్యం ఉన్న క‌థ కావ‌డం ఇక్క‌డ ప్ల‌స్ పాయింట్‌. సంగీత దర్శకుడు ఝాను చంథర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్‌. నాటి కాలానికి వెళ్లి.. అప్పుడు సినిమా షూటింగ్‌లు, సెట్లు ఎలా ఉంటాయో బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ సెకండాఫ్‌లో కొన్ని సీన్ల‌కు క‌త్తెర వేసి ఉండాల్సింది. ద‌ర్శ‌కుడు ఇలాంటి క‌థ‌ను తీస్తున్న‌ప్పుడు న‌మ్మి బ‌డ్జెట్ పెట్టిన నిర్మాత‌ల‌ను అభినందించ‌కుండా ఉండ‌లేం. నిర్మాతలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.


ఫైన‌ల్‌గా...
కాంత టైటిల్‌తో వ‌చ్చిన ఈ పీరియాడిక‌ల్ సినిమా డ్రామా సినిమాల‌ను బాగా ఎంజాయ్ చేసే వారికి, సినిమాల తెర‌వెన‌క ఆస‌క్తులు ఇష్ట‌ప‌డే వారికి బాగా న‌చ్చుతుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, టేకింగ్ బాగున్నాయి. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల స్లో అయిన‌ట్టు ఉంటుంది.


కాంత రేటింగ్‌: 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: