ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కరోనా సమయంలో స్వదేశానికి అండగా నిలుస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రవాసులందరూ తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎన్నారైలు తెలుగు రాష్ట్రాలకు కరోనా చికిత్సకు సంబంధించి వైద్య సామాగ్రిని ఉచితంగా అందించారు. ఇప్పటికీ నిరంతరాయంగా అందిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక పదహారేళ్ల యువకుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరోనా రోగులకు సాయం అందించేందుకు ఒక వాహనాన్ని అందజేశారు. తన స్నేహితులు, తన తల్లిదండ్రులకు తెలిసిన వారందరూ నుంచి వేల డాలర్ల విరాళాల సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని అంబులెన్స్ లు ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక అంబులెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించగా.. దాన్ని యర్రబాలెం గ్రామంలోని డాన్ బాస్కో హై స్కూల్ లో లాంచ్ చేశారు.


చీరాల, ప్రకాశం జిల్లా వాస్తవ్యులు చరగుల్లా సంజయ్ శాన్ ఫ్రాన్సిస్కో లోని శాన్ జోస్ లో నివసిస్తున్నారు. ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. అతని పదహారేళ్ళ కుమారుడు నిహార్ తన చిన్నతనం నుంచే చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిహార్ తల్లి ఆయేషా ఒక సామాజిక కార్యకర్త కాగా.. ఆమెను ఆదర్శంగా తీసుకొని అతను కూడా పరులకు సహాయం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అందుకే అతడు 15 వేల డాలర్ల విరాళాలు సేకరించి మాతృభూమికి అందిస్తున్నారు.



నిహార్ ఒక్కరే కాదు ఇంకా చాలా మంది భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తూ భారతీయ కరోనా రోగుల ప్రాణాలు నిలబెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన నీలిమ గోనుగుంట్ల ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో నివసిస్తున్నారు. ఆమె ఇప్పటివరకు 10 కోట్ల విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఆక్సీమీటర్లు తదితర వైద్య సామాగ్రిని భారతదేశంలోని అనేక నగరాలకు ఉచితంగా పంపిణీ చేశారు. యూఎస్‌లో లాయర్ గా, ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న నీలిమ గోనుగుంట్ల పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి.. ఆ విరాళాలను మాతృభూమి బాగోగుల కోసం ఖర్చు చేశారు. ఈ సహాయంతో తాను ఎంతోకొంత మాతృభూమి రుణం తీర్చుకోగలిగానని నీలిమ ఒక ప్రముఖ ప్రతిక తో మాట్లాడుతూ వెల్లడించారు. ఏది ఏమైనా ప్రవాసులు భారత దేశాన్ని విడిచి వెళ్లినా.. స్వదేశం పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: