భారతదేశానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థి చదువు నిమిత్తం ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాడు. అయితే అనుకోని సంఘటనల కారణంగా అతడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు నెలల పాటు జైలులోనే గడిపిన అతడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యాడు. వివరాలు తెలుసుకుంటే.. హర్యానా రాష్ట్రానికి చెందిన విశాల్ జుద్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. స్టూడెంట్ వీసాపై ఆ దేశానికి వెళ్లిన విశాల్ అక్కడే చాలా కాలం పాటు ఉంటున్నాడు. అయితే 2020 సెప్టెంబర్ నెల నుంచి 2021 ఫిబ్రవరి వరకూ రాజధాని సిడ్నీలో ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనలు పేట్రేగిపోయాయి. ఇండియాలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ అల్లర్లకు పాల్పడ్డారు.

అయితే ఈ నిరసనకారులకు వ్యతిరేకంగా విశాల్ స్నేహితుల బృందం నిరసనలకు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది. ఖలిస్తానీ నిరసనకారులు విశాల్ స్నేహితుల బృందంపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఖలిస్తానీవాదులు భారత దేశ జెండాకి నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోని చూసి కోపోద్రిక్తుడైన విశాల్ ర్యాలీ నిర్వహించాడు. మరోపక్క నిరసనకారులు పోలీసులను ఆశ్రయించి విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేశారు. తలపాగా ధరించిన సిక్కులపై హిందూ మతస్తులు దాడులు చేస్తున్నారని స్థానిక న్యూస్ మీడియా తో పాటు పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు విశాల్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొన్ని నెలల క్రితం విశాల్ పై మరో కేసు కూడా ఉండటంతో.. పోలీసులు రెండు ఆలోచన లేకుండా అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈసారి అతడిపై ఆస్తుల ధ్వంసం, హత్య యత్నం కింద కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలోనే చాలామంది ఎన్నారైలు, భారతీయ విద్యార్థులు, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాల్ కు మద్దతుగా నిలిచారు. విశాల్ తరుఫు లాయర్ న్యాయస్థానంతో ఒక వీడియోని సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. ఆ వీడియోలో ఖలిస్తానీ నిరసనకారుల రౌడీయిజం బట్టబయలైంది. వారు విశాల్‌పై దాడులు చేయడం, మోదీని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం వంటి విషయాలన్నీ వీడియోలో ఉన్నాయి. అలాగే వంద మంది నిరసనకారులు విశాల్ స్నేహితుల బృందం పై దాడి చేసిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి. ఒక నిరసనకారుడు బేస్ బాల్ బ్యాట్‌తో విశాల్‌ను కొట్టేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపించింది. అయితే ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న విశాల్‌ అతడి కారుపై దాడి చేశాడు. ఈ వీడియోను పరిశీలించిన ఆస్ట్రేలియా కోర్టు న్యాయమూర్తి విశాల్‌ను నిర్దోషిగా తేల్చి కేసు కొట్టివేశారు. దాంతో ఎట్టకేలకు విశాల్‌కు ఆస్ట్రేలియా జైలు నుంచి విముక్తి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: