రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్, సిబిఐ నివేదికను తారుమారు చేసిన న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ లను మంత్రివర్గం  నుండి  తొలిగించే అంశంపై ప్రధాని  మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. ఇద్దరు మంత్రుల వ్యవహారం మూలంగా పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రతిపక్షం గొడవ, గందర గోళాల మధ్య కొట్టుకుపోవటం తెలిసిందే.

ఇద్దరు మంత్రులను తొలగిస్తే బడ్జెట్ రెండో విడత సమావేశాల  ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లుకు మోక్షం లభించి ఉండేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు మంత్రులను తొలిగించాలని సోనియా గాంధీ కోరుతుంటే మన్మోహన్ మూత్రం దీనికి అంగీకరించటం లేదని చెబుతున్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై సిబిఐ రూపొందించిన దర్యాప్తు నివేదికను తన కోసం సవరించిన న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్ ను తొలగించకూడదని మన్మోహన్ సింగ్ పట్టుపడుతున్నట్లు తెలిసింది.

ఇద్దరు మంత్రుల తొలగింపుపై కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపినట్లు తెలిసింది. ఇద్దరు కూడా తప్పు చేసినందున వారిని తొలిగించటం మంచిదని, తద్వారా సంకీర్ణ ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలని సోనియా గాంధీ తనదైన శైలిలో మన్మోహన్ సింగ్ కు సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రతిపక్షం డిమాండ్ కు లొంగిపోతే ప్రభుత్వం పై అవినీతి ముద్ర పడుతుంది కాబట్టి ఇది మంచి విధానం కాదని వాదిస్తున్నట్లు తెలిసింది.  ఈ ఇద్దరు మంత్రులు కొనసాగించటం సోనియా గాంధీకి ఎంత మాత్రం ఇష్టం లేదని ఏఐసిసికి చెందిన సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఇద్దరు మంత్రుల కోసం మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని పణంగా పెట్టవలసిన అవసరం తమకు ఎంత మాత్రం లేదని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: