న్యూఢిల్లీ: భారత చరిత్రలో బాబ్రీ మసీదు కూల్చివేత ఎలాంటి ఘట్టమో అందరికీ తెలిసిందే. దేశంలో ఈ ఘటన తర్వాత చాలా ప్రాంతాల్లో హిందూ - ముస్లిం మతాల మధ్య భారీగా ఘర్షణలు వెలుగు చూశాయి. చాలా ఉగ్రవాద సంస్థలు కూడా ఈ ఘటన తర్వాత మన దేశంపై పీకల వరకూ పగ పెంచుకున్నాయి. దీని గురించి ఏమైనా మాట్లాడటానికి కూడా చాలా మంది రాజకీయ నేతలు ఆలోచిస్తారు. అలాంటిది ఓ కేంద్ర మంత్రి ఈ ఘటన గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరో కాదు మోదీ క్యాబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాశ్ జవదేకర్.

బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన గురించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1992 డిసెంబరు 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఈ చర్యతో మన దేశంలో జరిగిన ఓ చారిత్రక తప్పిదానికి తెరపడిందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ‌కు విరాళాలు ఇచ్చిన వారు అందర్నీ ఉద్దేశించి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ఈ సందర్భంగానే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1992 డిసెంబరు 6వ తేదీన ఓ చారిత్రక తప్పిదాన్ని భారతీయులు సరిదిద్దారని ఆయన అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బాబర్ వంటి విదేశీ ఆక్రమణ దారులు భారత దేశానికి వచ్చిన సమయంలో.. రామ మందిరాన్ని టార్గెట్ చేసి ఎందుకు కూల్చేవేయాల్సి వచ్చింది? అని జవదేకర్ ప్రశ్నించారు. ఆ తర్వాత దీనికి బదులు చెప్తూ.. ‘‘ఎందుకంటే, ఈ దేశపు ఆత్మ ఆ రామాలయంలో ఉంటుందని వారికి తెలుసు’’ అని చెప్పారు. 1992 డిసెంబరు 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేయడంతో.. బాబరు హయాలో జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవడం జరిగిందని జవదేకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జవదేకర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: