మావోయిస్ట్‌ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె. మరణం వెనుక ఛత్తీస్గఢ్ పోలీసుల వ్యూహం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్కే ఆరోగ్యంపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉందని, అందుకే ఆపరేషన్ సమాధాన్‌ పేరుతో పోలీసులు టార్గెట్‌ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. వారం నుంచి పోలీసులు అడవిని చుట్టుముట్టి ఆపరేషన్ సమాధాన్‌ను అమలు చేసినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేకు వైద్యం అందకుండా చేయడంలో పోలీసులు సఫలం అయ్యారని సమాచారం. ఆపరేషన్ సమాధాన్‌ విజయవంతం అయిందని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అంటున్నారు.

మరోవైపు విప్లవ సంఘాల్లో కూడా ఇవే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి ఆపరేషన్ సమాధాన్‌తోనే చత్తీస్‌గఢ్‌ పోలీసులు రామకృష్ణ మరణాన్ని చూశారని విప్లవ సంఘాల వారు సైతం బలంగా వాదనలు వినిపిస్తున్నారు. పక్కా సమాచారం, ప్రణాళికతో పోలీసులు ఆపరేషన్ సమాధాన్‌ వ్యూహాన్ని అమలు చేశారని చెప్పుకుంటున్నారు అనుకున్న దాని ప్రకారం వైద్యం అందక ఆర్కే చనిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నిర్ధారించుకున్నారు. దాన్నో విజయంగా భావించి ఆ తర్వాత మీడియాకు లీక్‌ చేయడం జరిగిందని అనుకుంటున్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఇటీవల కాలంలో ఇంకా విషమించింది దీనిపై పక్కా సమాచారం కలిగిన చత్తీస్‌గఢ్‌ పోలీసులు.. ఇదే అదునుగా తమ ఆపరేషన్‌ సమాధాన్‌ వ్యూహాన్ని అమలు చేశారట. నిజానికి కరోనా సమయానికి ముందు నుంచే ఈ విషయంలో ఆపరేషన్ సమాధాన్‌ను పక్కాగా అమలు చేస్తూ వస్తున్నారట చత్తీస్గడ్ పోలీసులు. మావోయిస్టుల కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లడం కంటే... బస్తర్‌, బీజాపూర్ అడవులలోకి వెళ్లే దారులను ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసి, రాకపోకలపై నిఘా ఉంచడం మేలు అని పోలీసులు అనుకున్నారట. లోపలి వాళ్లను బయటకు, బయటి వాళ్లను లోపలకు రానివ్వకుండా.. పోనివ్వకుండా.. ఆపరేషన్ సమాధాన్‌ వ్యూహాన్ని అమలు చేశారట. దీంతో చివరకు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందట.

రామకృష్ణ చనిపోయారని పక్కాగా పోలీసులు తెలుసుకున్నారు. తమ ఇన్ఫార్మర్ల ద్వారా ఆ సమాచారం అందగానే.. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు దాన్ని ధృవీకరించుకున్నారు. అనంతరం ఆర్కే మరణాన్ని మీడియాకు లీక్ చేశారని తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు కూడా రామకృష్ణ మరణాన్ని ఆలస్యంగా నిర్ధారించడం వెనుక ఆపరేషన్ సమాధాన్‌ కారణం అయ్యి ఉండొచ్చని విప్లవ సంఘాల నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: