అవును, కాంగ్రెస్ పగ్గాలు మారిపోయే టైమ్ వచ్చింది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఓసారి కాంగ్రెస్ టీమ్ సమావేశం అయినా.. అందరూ అధినాయకత్వ మార్పుని కోరుకోలేదు. సోనియాకే జై కొట్టారు. గాంధీ కుటుంబంపై తమకున్న విధేయత చాటుకున్నారు. కానీ అనూహ్యంగా కపిల్ సిబల్ ఓ బాంబు పేల్చారు. పార్టీ అధ్యక్షుడు కాకపోయినా రాహుల్ గాంధీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ పగ్గాలు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈరోజు జీ-23 మీటింగ్ లో కూడా ఇదే విషయం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశముంది.

ప్రక్షాళణ ఇలా మొదలైందా..?
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరో ముఖ్య నిర్ణయం తీసుకొన్నారు. పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ లను పదవులకు రాజీనామా చేయాల్సిందిగా కోరారు. పీసీసీ పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ దీప్‌ సూర్జేవాలా సోషల్ మీడియా వేదికగా సోనియా నిర్ణయాన్ని వెలిబుచ్చారు. అయితే ఈ ఆదేశాలు రాకమునుపే ఉత్తరాఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు గణేష్ గోడియాల్‌ తన రాజీనామా ప్రకటించారు.

కింది స్థాయివారిపైనే ప్రతాపమా..?
ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ అన్నీ తానై పార్టీకోసం కష్టపడ్డారు. అక్కడ కూడా ఫలితం రాలేదు. మరి ప్రియాంకపై కూడా  చర్యలు తీసుకుంటారా.. లేక ఎన్నికలకోసం ఆమె కష్టాన్ని పరిగణలోకి తీసుకుంటారా..? మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో మాత్రం చురుకు పుట్టింది. ముందుగా ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లపై ప్రతాపం చూపించారు. ఇక ఇప్పుడు అధినాయకత్వం కూడా మార్పు కోరుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు జీ-23 నేతల ఆరోపణలపై కూడా కొంతమంది గాంధీ కుటుంబ వీర విధేయులు స్పందించారు. ఆరోపణలు చేసేవారంతా పదవులు ఆశిస్తున్నారంటున్నారు. వారు బీజేపీలోకి వెళ్లాలని విమర్శించారు. కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలడం కంటే.. ముందే గాంధీ కుటుంబం పక్కకు తప్పుకోవాలనేవారు కూడా ఉన్నారు. మొత్తమ్మీద సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకోడానికి రెడీ అయ్యారని సమాచారం. ఆ నిర్ణయంతో అయినా పార్టీకి పునర్ వైభవం వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: