క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయస్ధాయిలో అదాని గ్రూపు ప్రతిష్ట మసకబారిపోయింది. గ్రూపు షేర్ విలువ వేలకోట్ల రూపాయలు పతనమైపోతోంది. గడచిన నాలుగురోజులుగా షేర్ల ధరలు పడిపోతున్న కారణంగా అదాని కంపెనీ ఇప్పటికే సుమారు రు. 4.5 లక్షల కోట్లరూపాయలు నష్టపోయింది.  దాంతో పెట్టుబడిదారుల్లో అదాని గ్రూపుపై నమ్మకం తగ్గిపోతోంది. అందుకనే వచ్చినకాడికి తమ షేర్లను అమ్మేసుకుంటున్నారు. అమెరికాలో రిజిస్టర్ అయిన పరిశోధనా సంస్ధ  హిండెన్ బర్గ్ రిపోర్టుతో గ్రూపు మొత్తం అల్లల్లాడిపోతోంది.





సరే గ్రూపు ఓవరాల్ వ్యవహారాన్ని పక్కనపెట్టేస్తే దాని ప్రభావం ఏపీ మీద పడటం ఖాయమనే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే ఏపీలోని దాదాపు పోర్టులన్నింటినీ అదానీ గ్రూపే సొంతం చేసుకుంది. ఇదికాకుండా గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అలాగే విశాఖలో అతిపెద్ద డేటా కేంద్రం ఏర్పాటుకు రెడీ అవుతోంది. గ్రూపు క్రెడిబులిటియే ప్రమాదంలో పడినపుడు ఏ యాజమాన్యమైనా ఏమిచేస్తుంది ? ముందు క్రెడిబులిటి నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది.





ఇపుడు గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదాని కూడా అదే చేస్తున్నారు. ఇక్కడే ఏపీ అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం పడటం ఖాయమని అనిపిస్తోంది. విషయం ఏమిటంటే గ్రూపులో పెట్టుబడులు పెట్టినవారందరికీ వాళ్ళ పెట్టుబడులు వెనక్కిచ్చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇలాగ వెనక్కిచ్చేయాల్సిన పెట్టుబడులు సుమారు రు. 90 వేల కోట్లుంటుందట. ఈ 90 వేల కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేయాలంటే చిన్న విషయం కాదు. ఎంత తొందరగా వెనక్కిచ్చేస్తే గ్రూపు క్రెడిబులిటి అంతగా నిలుస్తుంది.  ఇపుడు రు. 90 వేల కోట్లను తీర్చేపనిలో పడ్డారంటే దాని ప్రభావం కొత్త పెట్టుబుడులు, విస్తరణ పై పడుతుంది.





దీంతో ఏపీలో పెట్టాల్సిన రు. 60 వేల కోట్ల పెట్టుబడలకు బ్రేక్ పడటం ఖాయం. అలాగే సొంతం చేసుకున్న కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు.  ఇక రు. 14 వేల కోట్లతో ఏర్పాటవుతున్న డేటాసెంటర్ పనులు కూడా స్లో అయిపోతాయి. మొత్తంమీద చూస్తే ఏపీ అభివృద్ధిపై అదానీ గ్రూపు దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: