ఏ ఛానల్ ను జనం బాగా చూస్తున్నారు.. ఏ ఛానల్ కార్యక్రమాలకు ఆదరణ ఉంది.. ఏ ఛానెల్ నంబర్ వన్.. ఏ ఛానల్ ఏ ప్లేస్ లో ఉంది.. ఈ విషయాలను తేల్చేవి రేటింగులే.. వారం వారం వచ్చే రేటింగులే టీవీలకు ప్రాణాధారం. వీటి ఆధారంగానే ఏ ఛానల్ కు యాడ్ ఇవ్వాలనే విషయాన్ని అడ్వర్టైజర్లు నిర్ణయించేసుకుంటారు. అందుకే రేటింగ్ లకు అంత ప్రాధాన్యం. 

కానీ ఇప్పుడు తెలుగు మీడియాలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటివరకూ టామ్ సంస్థ ఇస్తున్న రేటింగులే అన్ని టీవీ ఛానళ్లకు ఆధారంగా ఉండేవి. కొన్ని నెలల నుంచి  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ పేరుతో వస్తున్న రేటింగులు టామ్ కు భిన్నంగా ఉంటున్నాయి. టామ్ కంపెనీ చాలా తక్కువ శాంపిల్ తీసుకుంటోందని.. రేటింగుల్లో విశ్వసనీయత లోపించిందనే బార్క్ సిస్టమ్ వచ్చింది. 

బార్స్ సిస్టమ్ లో గ్రామీణ ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో రేటింగుల స్వరూపమే మారిపోయింది. అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లలో చాలా కాలం తర్వాత ఈటీవీ ఫస్ట్ ప్లేస్ కు వచ్చింది. సుదీర్ఘ‌కాలంగా టామ్ రేటింగ్స్ లో మా టీవీ ముంద‌జంలో ఉంటోంది. జెమినీ త‌ర్వాతి స్థానంలోనూ, జీటీవీ, ఈటీవీల్లో ఒక‌రు తృతీయ స్థానాల్లో నిలుస్తూ వ‌చ్చేవి. తాజాగా బార్క్ సిస్టమ్ ప్రకారం ఈటీవీ ఫస్ట్ ప్లేస్, జీటీవీ సెకండ్, మా థర్డ్ ప్లేస్ సంపాదించాయి. 

అటు న్యూస్ ఛానళ్లలో అదే పరిస్థితి. ఫస్ట్ ప్లేస్ టీవీ9 దే అయినా..  త‌ర్వాత స్థానాల్లో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. టామ్ రేటింగ్స్ లో అప్పుడుప్పుడు మొద‌టి స్థానంతో పాటు నిత్యం రెండు, మూడు స్థానాల్లో నిలిచే టీవీ5...  బార్క్ రేటింగ్స్ లో బాగా వెనుక‌డి పోయింది. టామ్ లో ఎక్క‌డో క‌నిపించే సాక్షి.. బార్క్ లో రెండో స్థానంలోకి వచ్చేసింది. టామ్ కంటే బార్క్ కే ఎక్కువ విశ్వసనీయత ఉంటుందంటున్నారు మీడియా విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: