రాజకీయాల్లో లక్ కలసి రాకపోయినా బకరా అయిపోతారు. ఎత్తులు, జిత్తులు, పొత్తులు వికటించినా కూడా అయ్యేది అదే. హగ్గులు ఎన్ని ఇచ్చుకున్నా కడుపులో కత్తులు అలాగే ఉంటాయి. ఎన్ని స్నేహగీతాలు ఆలపించినా చిత్తు చేసేందుకు వ్యూహాలు రెడీగా ఉంటాయి. మరదే పాలిట్రిక్స్. శాశ్వత స్నేహాల మాట దేముడెరుగు. టెంపరరీ ఫ్రెండ్ షిప్పులకూ ఇక్కడ చాన్సే లేదు.
దొందూ దొందే :

తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ దోస్తీ ఇపుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇదేంటి ఇలా అని అంతా నోళ్ళు వెళ్ళ బెట్టే పొత్తు అది. దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టేసి ఒక్కటవుతున్నారంటేనే అవాక్కు అయ్యే సీన్. మరి ఈ రెండు పార్టీల గురించి ఆలోచించినపుడు ఇద్దరూ ఇద్దరే అనిపిస్తుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయనక్కరలేదు. స్నేహ హస్తం అందించి కాంగ్రెస్ ఎందరినో కిందకు లాగేసిన చరిత్ర వెనకాలేసుకుంది. టీడీపీ ఏమన్నా తక్కువ తిందా...ఆ పార్టీ కూడా పొత్తులతో ఎపుడూ తానే లాభపడుతూ టైం చూసి తెర దించేసే టాలెంట్ కలిగిన పార్టీ
వాడేసుకుంటారా :

కాంగ్రెస్ పార్టీ అంటేనే విషపు కౌగిలి అని చెప్పిన చంద్రబాబే అందులో చేరిపోయాడు. బాబు జిత్తులమారి అని నిందించిన హస్తం నేతలు ఆయన సైకిలెక్కెస్తున్నారు. మరి సమ ఉజ్జీలైన ఇద్దరిలో ఎవరు పడిపోతారు, ఎవరు పడగొడతారు అంటే కాలమే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. బాబుది కూడా కాంగ్రెస్ స్కూలే, పైగా ఆ పార్టీకి తెలియని ఎన్నో నయా ట్రెండ్స్, జిమ్మిక్కులు బాబు దగ్గర ఉన్నాయి. అందువల్ల బాబుతో పెట్టుకోవడం కాంగ్రెస్ కే షాక్ అంటున్న వారూ ఉన్నారు. ఇక కాంగ్రెస్తో ఆటలంటే మజాకా కాదంటున్న వారూ ఉన్నారు.
నమ్మని బంధం :

చిత్రమేంటంటే ఈ ఇద్దరి పొత్తునూ జనమే కాదు, వాళ్ళూ నమ్మడంలేదు. ఒకరిని ఒకరు అనుమానంగానే చూసుకుంటున్నారు. ఓడిపోయే సీట్లు కాంగ్రెస్ కి ఇద్దామని బాబు ప్రతిపాదిస్తూంటే, బాబుకూ అదే తాంబూలం ఇద్దామని కాంగ్రెస్ సిధ్ధమవుతోందంట. సెటిలర్ల సపోర్ట్ కోసం అలా సైకిలెక్కినట్లు నటిస్తున్న కాంగ్రెస్ బాబుని ఎంత తక్కువ చేయాలంటే అంతగా చేయాలనుకుంటోంది.
మరో వైపు మోడీతో చెడి గతి మాలి కాంగ్రెస్ తో స్నెహం అంటున్న బాబు ఆ పార్టీని అస్సలు నమ్మడంలేదు. అందుకే ఎక్కువ సీట్లు, తాము గెలిచేవి తీసుకోవడం ద్వారా గరిష్ట లాభం పొందాలనుకుంటున్నారు. ఇలా ఒకర్ని ఒకరు వాడేసుకోవాలన్న ఆరాటం తప్ప అసలైన బంధం లేని ఈ పొత్తు ఎన్నికల వరకైనా సాగుతుందా అన్నది పెద్ద డౌటే మరి.