తెలంగాణ రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రారంభోత్స‌వంను పండుగలా జ‌రుపుకొనేందుకు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స‌న్న‌ద్ధం అవుతోంది. ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ అద్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యించారు. ఈ  వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తక్కువ సమయంలో పూర్తిచేసినందుకు రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్రకమిటీ సభ్యులు రైతులతో మమేకమై ఎక్కడివారక్కడ సంబురాలు జరుపుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ వస్తున్నందున భద్రతాకారణాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ సభ్యులను అక్కడికి ఆహ్వానించలేకపోతున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోసారి అక్కడికి వెళ్దామని తెలిపారు. రైతులతో మమేకమై పార్టీ ప్రతినిధులు సంబురాలు చేసుకోవాలని చెప్పారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమాజానికి రక్షణ కవచంలాగా ఉంటున్న విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వివరించారు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకోసం రూ.19.20 కోట్లు పార్టీ నిధుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటి నిర్మాణ బాధ్యతలను నాయకులకు త్వరలోనే అప్పగిస్తారని చెప్పారు. ఈనెల 24న సోమవారం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెప్పారు. వచ్చే దసరా నాటికి వీటి నిర్మాణాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


కాగా, ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని పల్లా వెల్లడించారు. అదేరోజు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించి సభ్యత్వ నమోదును శ్రీకారం చుడ్తారన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జిని నియమించనున్నట్లు వివరించారు. జూలై 20 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. జూలై నెలాఖరుకల్లా గ్రామ కమిటీలను పూర్తిచేస్తామని, అనంతరం శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కార్యవర్గంలో ఉండి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారని పల్లా చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: