పోలవరం మళ్లీ చిక్కుల్లో పడింది. సవరించిన డీపీఆర్ ను ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంటే... పాత అంచనాలనే ఆమోదిస్తామంటోంది కేంద్రం. మరి ప్రాజెక్టు నిర్మాణం పరిస్థితేంటి? పునరావాసం సంగతేంటి? జగన్‌ ప్రభుత్వం‌ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటుందనే కదా అనుమానం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే నిధుల్లో భారీ కోతకు సిద్ధమవుతోంది... కేంద్రం ప్రభుత్వం. మొత్తం వ్యయం అంచనా 20 వేల 389 కోట్ల 61 లక్షల రూపాయలు మాత్రమేనని... ఇప్పటికే ఇచ్చిన నిధుల్ని మినహాయిస్తే... ఇక ఇవ్వాల్సింది 4 వేల 819 కోట్ల 47 లక్షల రూపాయలు మాత్రమేనని చెబుతోంది... కేంద్ర ఆర్థిక శాఖ. దీనిపై ఏపీ సర్కార్‌ ఆమోదం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించినట్లు సమాచారం.

2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం 20 వేల 398 కోట్ల 61 లక్షల రూపాయలు. 2018లో సవరించిన డీపీఆర్  ప్రకారం తుది అంచనా వ్యయం 57 వేల 297 కోట్లు. నాలుగు, ఐదేళ్లలోనే అంచనా వ్యయం భారీగా పెంచి చూపడంపై కేంద్ర నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది. అనేక దఫాలు చర్చించాక... 55 వేల 548 కోట్ల అంచనా వ్యయానికి సలహా కమిటీ అంగీకరించింది. కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా 47 వేల 725 కోట్లకు ఆమోదం తెలిపి.. ఆర్థిక శాఖకు పంపినట్టు సమాచారం.

కానీ ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయింది. 2014 డీపీఆర్ ప్రకారం 20 వేల 389 కోట్ల వ్యయాన్నే ఆమోదించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మొగ్గు చూపుతోంది. అయితే... పునరావాసానికే 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ప్రాజెక్టు నిర్మాణానికి మరో 10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టడం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ తాజా వైఖరితో... పోలవరం భవితవ్యం ఎలా ఉంటుందో అని... సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: