అనుకున్నదే జరిగింది..! యూరప్‌ కంట్రీస్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. మహమ్మారి రెండో దెబ్బకి ఫ్రాన్స్‌, జర్మనీ మళ్లీ లాక్‌డౌన్‌ను ప్రకటించాయి‌. మరి కొన్ని యూరప్‌ దేశాలు కూడా లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి‌.

ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తోంది. భారత్ సహా కొన్ని దేశాలు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ ఆ రెండు దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయాయి.. కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆ రెండు దేశాలే ఫ్రాన్స్‌, జర్మనీ. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్‌, జర్మనీ లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఫ్రాన్స్‌ ఒకటి. అలాంటి దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి కేసులు భారీగా పెరుగుతున్నాయి‌. మరణాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి‌. గత 24 గంటల్లో ఈ యూరప్‌ దేశంలో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు  డిసెంబరు 1 వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. దేశంలో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 3 వేల మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు. నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా ఉన్నాయ్‌. రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయనున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే, తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాలి. వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది.

ఒక వేళ లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని మాక్రాన్‌ తెలిపారు. ఇక జర్మనీలో కూడా నవంబర్‌ 2 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. జర్మనీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయ్‌. కొత్తగా 14 వేల కేసులు నమోదయ్యాయ్‌. దీంతో నవంబర్‌ 2 నుంచి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ప్రకటించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: