ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు రాజకీయంగా సంకట స్థితిలో ఉన్నారు. ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న‌ ప్రణాళికతో బీజేపీ జాతీయ నాయకత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ పగ్గాలు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో సీనియర్ నేత గా ఉన్న మాజీ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు 2019 ఎన్నికలకు ముందు ఏపీ బిజెపి పగ్గాలు అప్పగించింది.

ఆ ఎన్నికల్లో ఆయన నరసరావుపేట నుంచి బిజెపి తరఫున లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కన్నా పనితీరు సంతృప్తిగా లేదని బిజెపి జాతీయ నాయకత్వం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు కి పార్టీ పగ్గాలు కట్టబెట్టింది. పార్టీలో దూకుడుగా ఉండే సోము వీర్రాజు ఏపీలో బీజేపీ ని పటిష్టం చేయడంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని పార్టీవైపు మళ్లీస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే సోము వీర్రాజు ఏకపక్ష వైఖరితో పార్టీకి చాలామంది దూరమవుతున్నారు. ఆయ‌న ఓ కులానికి చెందిన నేత‌ల‌నే వెంట పెట్టుకుని తిరుగుతున్నార‌న్న విమ‌ర్శ‌లు సొంత పార్టీలోనే వ‌చ్చేశాయి. అందుకే బీజేపీలో చేరికలకు ఫుల్ స్టాప్ పడిందని చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం నేతలు టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే వారు వ్యాపారాలను కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలనుకున్నా... సోము వీర్రాజు వైఖరితో వారు కూడా వెనక్కు తగ్గుతున్నారు.

ఇక ఈ విష‌యాల‌పై నివేదిక‌లు తెప్పించుకున్న బీజేపీ అధి నాయ‌క‌త్వం సోమును కూడా ప‌క్క‌న పెట్టేసి రెడ్డి వ‌ర్గం నేత‌ల‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇచ్చే ఆలోచ‌న చేస్తోంద‌ట‌. ఇక సోము రాజ్య‌స‌భ కావాల‌ని అడుగుతున్నా.. ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌మ‌ని.. కావాలంటే 2024 ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి పార్టీ త‌ర‌పున లోక్‌స‌భ కు పోటీ చేయాల‌ని చెప్పింద‌ట‌. దీంతో అవాక్క‌వ్వ‌డం సోము వంతు అయ్యింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: