
నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద వాహనాల మార్కెట్లలో ఒకటిగా ఎదుగుతున్న భారత్‌పై మస్క్ ఎప్పటినుంచో కన్నేశాడు. తన కంపెనీ ఉత్పత్తులను ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మనదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో కలిసి టైఅప్ చేసుకుని భారత్‌లోనే ఈ కంపెనీ కార్లను తయారుచేసే అవకాశం ఉందన్న వార్తలు గతంలో వచ్చాయి. భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తో టెస్లా జతకట్టబోతుందనే వార్తలతో టాటా మోటార్స్ షేరు ధర కొంతకాలం క్రితం పైకి దూసుకుపోయింది. అయితే ఏమైందో ఏమోగాని ఆ ప్రయత్నాలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు భారత ప్రభుత్వ విధానాలను అతడు విమర్శిస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా కామెంట్ చేయడంతో దానిపై ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది. సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను ఎలాన్ మస్క్ మానుకుంటే మంచిదని, అతడు భారత్ మార్కెట్‌లోకి రావాలంటే ఇక్కడే కార్లను తయారుచేసి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అసలు విషయమేమిటంటే భారత మార్కెట్లో కొంతకాలంపాటు విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే విక్రయిస్తామని, ఆ తరువాత వీలునుబట్టి తయారీ యూనిట్ స్థాపించే ప్రయత్నాలు చేస్తామని మస్క్ ప్రభుత్వానికి తెలిపారు. కార్ల దిగుమతిపై ఉన్న పన్నుల నుంచి రాయితీ ఇవ్వాలని కూడా కోరారు. అయితే భారత ప్రభుత్వం దీనికి అనుమతించలేదు. తయారీ యూనిట్‌పై స్పష్టత లేకుండా రాయితీలివ్వలేమని స్పష్టం చేసింది. దీంతో తన వ్యాపార వ్యూహం ఫలించలేదన్న కారణంతో ఎలాన్‌మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలకు దిగాడని అనుకోవాలి. ఇదిలా ఉండగా భారతీయ ఆటోమొబైల్ కంపెనీలు సొంతంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీపైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాయి.