కాపు సామాజికవర్గం ప్రముఖుడు, మాజీమంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో ఒక పిటీషన్ వేశారు. అదేమిటంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి వైసీపీ మ్యానిఫెస్టోలో చెప్పారు కాబట్టి వెంటనే అమలుచేసేట్లు ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. తన పిటీషన్లో జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సాంఘీకసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. పిటీషన్ను పరిశీలించిన కోర్టు ఎన్నికల హామీలను అమలుచేయాలని తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని చెప్పేసింది. పైగా సీఎంను ప్రతివాదిగా చేర్చటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.




దాంతో ప్రతివాదుల జాబితాలో సీఎం పేరును తొలగించటానికి జోగయ్య తరపు లాయర్ అంగీకరించటంతో పిటీషన్ను విచారణకు స్వీకరించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన పార్టీలు అమలుచేయకపోయినా అడిగేవాళ్ళు లేరని తేలిపోయింది. అసలు జోగయ్య పిటీషనే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వస్తే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. రిజర్వేషన్ గురించి చెప్పలేదు కాబట్టి మ్యానిఫెస్టోలో అవకాశమే లేదు.




కాపులను బీసీల్లో చేరుస్తానని హామీఇచ్చింది 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు. హామీని నిలుపుకోవటంలో ఫెయిలైంది చంద్రబాబు. అయితే 2018లో ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది నరేంద్రమోడీ ప్రభుత్వం. అందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చంద్రబాబు జీవో జారీచేశారు. అయితే అమలు మాత్రం చేయలేదు. ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్ అంశంపై  జగ్గంపేట బహిరంగసభలో డిమాండ్లు వినిపించినా జగన్ కుదరదని తేల్చిచెప్పేశారు.



వాస్తవం ఇదైతే జోగయ్య మాత్రం తన పిటీషన్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని జగన్ హామీఇచ్చినట్లు కోర్టులో పిటీషన్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ జీవోనే చెల్లదని కొందరంటున్నారు.  ఈ నేపధ్యంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కోసం కోర్టులో పిటీషన్ వేయటం విచిత్రంగా ఉంది. జనాభా ప్రాతిపదికన అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించాల్సిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించటమే చంద్రబాబు చేసిన తప్పు. ఆ తప్పుకు జోగయ్య చట్టబద్దత కోరటం మరీ విచిత్రంగా ఉంది. కాపులకు రిజర్వేషన్ కోరటంలో తప్పులేదు కానీ జగన్ ఇవ్వని హామీని ఇచ్చినట్లుగా జోగయ్య పిటీషన్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: