జమ్మూ కాశ్మీర్‌, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్‌ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 30 మంది అమాయకులు మరణించినట్లు సమాచారం. మరింతమంది గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరణించిన వారిలో హైదరాబాద్ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ తో పాటు కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్ర దాడి కావడం గమనార్హం.

దాంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున సాయుధ బలగాలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ 2 రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని వెనుదిరిగారు. ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడిని యావత్ భారత్ దేశమే కాకుండా, పలు దేశాల అధ్యక్షులు సైతం ఖండిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఓ పర్యాటకుడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఉగ్ర మూకలు తనని కూడా చంపేస్తారనే భయంతో సదరు వీడియో తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో తుపాకుల శబ్దాలు చాలా స్పష్టంగా వినిపించాయి.

కాగా దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని అస్సలు వదలిపెట్టొద్దు! అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న 'లష్కరే తోయిబా' అనుబంధ సంస్థ 'ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకోవడం కొసమెరుపు. దాంతో జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక.. ఉగ్రవాది "సైఫుల్లా ఖలీద్" హస్తం ఉందని సర్వత్రా అనుమానం రేకెత్తుతోంది. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని జాతీయ మీడియా సంస్థలు సైతం పేర్కొంటున్నాయి. భారతదేశంలో జరిగిన అనేక పలు ప్రధాన ఉగ్రవాద దాడులలో సైతం ఇతని పేరు ప్రస్తావించబడిందని వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: