
పైకి మైత్రి - లోపల గుబులు?
ఈ భేటీ అనంతరం పాకిస్తాన్‌కు చైనా పూర్తి మద్దతు ప్రకటించిందని ఇస్లామాబాద్ వర్గాలు ఘనంగా ప్రకటించుకున్నాయి. తమకు డ్రాగన్ దేశం అండగా నిలుస్తుందని, అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నాయి. అయితే, తెర వెనుక కథ వేరే ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు విషయం పాకిస్తాన్ భద్రతా వైఫల్యాలు, ముఖ్యంగా బలూచిస్తాన్‌లో చైనా ఎదుర్కొంటున్న ప్రతిఘటనే అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బలూచ్ రెబెల్స్ దెబ్బకు చైనా విలవిల..
గత కొంతకాలంగా బలూచ్ వేర్పాటువాద శక్తులు పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టులు, పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC), గ్వాదర్ పోర్ట్ నిర్మాణాలపై బలూచ్ రెబెల్స్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇది తమ భూభాగమని, తమ సహజ వనరులను చైనా దోచుకోవడానికి వీల్లేదని వారు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. గ్వాదర్ పోర్టుకు వెళ్లే మార్గాలను దిగ్బంధం చేయడం, చైనా ఇంజనీర్లు, కార్మికులపై దాడులు చేయడం వంటి ఘటనలతో డ్రాగన్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్వాదర్ పోర్టు ద్వారా తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించుకోవాలనుకుంటున్న చైనా ఆశలకు బలూచ్ రెబెల్స్ గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి దాడులను అరికట్టడంలో విఫలమవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టిగా క్లాస్ పీకడానికే చైనా రాయబారి నేరుగా దేశాధ్యక్షుడితో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ బలూచ్ రెబెల్ నాయకుడు చైనాను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. "చైనా జాగ్రత్త.. ఇది మా భూమి, మా పోర్టు. ఇక్కడ మీ పెత్తనం సాగనివ్వం. మా జోలికి వస్తే ఒక్కరినీ వదిలిపెట్టం, మీ తాట తీస్తాం" అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే చైనా తన పౌరులు, పెట్టుబడుల భద్రతపై పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది.
చైనా తమకు మద్దతుగా ఉందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. చైనా మద్దతు పరోక్షంగా ఉండొచ్చు కానీ, ప్రత్యక్షంగా సైనిక చర్యల్లో పాల్గొనే అవకాశం లేదు. బలూచ్ రెబెల్స్ సమస్యను పరిష్కరించడంలో పాకిస్తాన్ వైఫల్యం చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనని, పాకిస్తాన్ మాత్రం దాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తాజా పరిణామం పాక్-చైనా సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.