
ఈ దాడుల తీవ్రతకు ఉత్తర కశ్మీర్‌లోని తంగ్ధర్ గ్రామంలో ఓ పౌరుడి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అంతటితో ఆగని పాక్ సైన్యం మృత్యుఘోష సృష్టించింది. వారి విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పూంచ్ జిల్లాలోని మన్కోట్ సెక్టార్‌లో ఓ ఇంటిపై మోర్టార్ షెల్ పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె 13 ఏళ్ల కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. మరో తొమ్మిది మంది సాధారణ పౌరులు కూడా పాక్ సైన్యం జరిపిన దాడుల్లో గాయపడ్డారు, వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మే 6, 7 తేదీల మధ్యరాత్రి పాక్ సైన్యం ఈ దుశ్చర్యకు పాల్పడింది.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసి, ఉగ్రవాదుల నడ్డి విరిచిన అనంతరం పాకిస్థాన్ ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తెగబడటం వారి కుటిలనీతికి నిదర్శనం. భారత సైన్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పాకిస్థాన్ కాల్పులకు దీటుగా, శక్తివంతంగా సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో ఇరువైపులా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ రీజియన్‌లోని ఐదు సరిహద్దు జిల్లాలు - జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంచ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు అధికారులు ముందుజాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించారు. మన్కోట్‌తో పాటు పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్ సెక్టార్లలో; రాజౌరీ జిల్లాలోని లామ్, మంజకోట్, గంభీర్ బ్రహ్మణ; ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని కర్ణా, యూరీ సెక్టార్లలో పాక్ దాడుల తీవ్రత అధికంగా ఉంది.
పాక్ షెల్లింగ్ భయంతో ప్రజలు భూగర్భ బంకర్లలో తలదాచుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. భారత భద్రతా దళాలు సరిహద్దుల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ, పాక్ దుష్ట పన్నాగాలను తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.