ఇప్పటికే సోషల్ మీడియాలో ఇండియన్స్ నుంచి టర్కీ నిరసన సెగ ఎదుర్కొంటుంది. బాయ్‌కాట్ టర్కీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండడంతో భారత్ నుంచి భారీ సంఖ్యలో టూరిస్టులు టర్కీ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. అలాగే ఇండియాలోని ఆపిల్ వ్యాపారులు టర్కీ పై స్వచ్ఛందంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. టర్కీ నుంచి యాపిల్ దిగుమతిపి ఆపేస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా టర్కీ కి షాకుల మీద షాకులు ఇస్తూ చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఆ దేశానికి చెందిన సెల్బి ఎయిర్‌పోర్ట్ సర్వీస్ అనే కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తరువులు జారీ చేసింది.
అయితే భవిష్యత్తులో బాయ్‌కాట్ టర్కీ పూర్తిగా అమల్లోకి వస్తే ఇండియాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, భారత్-టర్కీ మధ్య ఎగుమతులు, దిగుమతులు అధిక సంఖ్యలో జరుగుతుంటాయి. ఇప్పుడు వాణిజ్యం స్తంభించకపోతే టర్కీ తో పాటుగా మనదేశంలోనూ కొన్ని వస్తువులపై ఆ ప్రభావం పడుతుంది. టర్కీ నుండి దిగుమతి అయ్యే వస్తువుల్లో ప్రధానంగా మార్బుల్స్, యాపిల్స్ ఉన్నాయి. భారతదేశానికి ఆపిల్స్‌ను సరఫరా చేసే అతిపెద్ద దేశాలలో టర్కీ ఒకటి. ప్రతి సంవత్సరం టర్కీ నుంచి 1.29 లక్షల టన్నుల యాపిల్స్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది.
అలాగే మన దేశం దిగుమతి చేసుకునే మార్బుల్స్ 70 శాతం టర్కీ నుంచే వస్తాయి. ఇప్పుడు దిగుమతులు ఆగిపోతే యాపిల్స్, మార్బుల్స్ రేట్లు భారీగా పెరుగుతాయి. అదేవిధంగా టర్కీ నుంచి దిగిమతి అయ్యే బంగారం, సిమెంట్, డెకరేటివ్ ఐటెమ్స్, ఫర్నిచర్, డ్రై ఫ్రూట్స్, సిల్క్, ఆలివ్ ఆయిల్, చెర్రీస్, హెర్బల్ డ్రింక్‌లు, ఇండస్ట్రియల్ మెషినరీ, వ్యవసాయ సామాగ్రి, లెనిన్, గసగసాల రేట్లు కూడా పెరగొచ్చని అంటున్నారు.