
ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్‌ఖడ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక పంచుకున్న మీనా.. `మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది సార్. మీ నుండి చాలా నేర్చుకున్నాను, అవి నా భవిష్యత్తును నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. మీ సమయానికి చాలా ధన్యవాదాలు` అని పేర్కొంది. మీనా షేర్ చేసిన ఈ ఫోటో అనేక అనుమానాలకు తెర లేపింది. ఈ క్రమంలోనే మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. అధికారం కోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. పార్టీ బలోపేతానికి సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నటి ఖుష్బూ బీజేపీలో ఉన్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాని కూడా బీజేపీలో చేర్చుకోవాలని.. తద్వారా పార్టీకి మరింత హైప్ వస్తుందనే మాస్టర్ ప్లాన్‌లో కమలం పెద్దలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మీనా ఢిల్లీ వెళ్లి వెళ్లినట్టు టాక్ నడుస్తోంది.
కాగా, మీనా నాలుగున్నర దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన మీనా.. ప్రస్తుతం సహాయక నటిగా సత్తా చాటుతున్నారు. 2022లో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కూతురు నైనికతో మీనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.