ప్రేమించడం వారు చేసిన నేరం. ఒకే వంశంలో పుట్టడం వాళ్లకు శాపం. ఈ రెండు కారణాలతో ఓ గిరిజన జంటకు గ్రామస్థులు నరకాన్ని చూపించారు. నాగలి కాడికి వారిని కట్టి, పొలం దున్నించి, ఆపై ఊరే వదిలి వెళ్లిపోవాలంటూ తీర్పునిచ్చారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే.. కళ్యాణసింగ్‌పూర్ బ్లాక్‌ పరిధిలోని కంజమజోడి గ్రామానికి చెందిన యువతీయువకుడు ప్రేమలో పడ్డారు. అయితే, వీరిద్దరూ ఒకే వంశానికి (గోత్రానికి) చెందినవారు కావడంతో వీరి ప్రేమ వ్యవహారం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. గిరిజన కట్టుబాట్ల ప్రకారం, ఒకే వంశం వారిని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లుగా చూస్తారు. వారి మధ్య ప్రేమ, పెళ్లిళ్లు నిషిద్ధం. ఈ కట్టుబాటును ధిక్కరించినందుకు పంచాయితీ పెట్టి, ఆ జంటకు అత్యంత కఠినమైన శిక్ష విధించారు.

ఈ అమానవీయ చర్యను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వారు ఎంతగానో వేడుకున్నప్పటికీ, గ్రామస్థులు కనికరించకుండా ఈ శిక్షను అమలు చేశారు. ఇది తమ సంప్రదాయంలో భాగమని వారు సమర్థించుకోవడం గమనార్హం.

శిక్షలో భాగంగా, గ్రామదేవతకు పూజల అనంతరం, ఆ ప్రేమికులను నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ అమానుషాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. అంతటితో ఆగకుండా, ఆ జంటను ఊరి నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు, ఇది అత్యంత దారుణమని, విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాయగడ సబ్-కలెక్టర్ రమేష్ కుమార్ జేనా ఈ ఘటనను 'అమానుషం'గా అభివర్ణించారు, గ్రామాన్ని సందర్శించి విచారణ జరుపుతామని తెలిపారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కులాలు, గోత్రాలతో ప్రజలను హింసించే వారిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: