తెలుగు రాష్ట్రాల మధ్య సాగు నీటి ప్రాజెక్టులు, జలాల పంపకాలు వలన నెలకొన్న వివాదాలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి మరో కీలక అడుగు పడుతోంది. జూలై 16 (రేపు) మధ్యాహ్నం 2:30 గంటలకు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయడం విశేషం. బనకచర్ల ప్రాజెక్ట్ – వివాదాల కేంద్ర బిందువు ... ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అయితే దీనివల్ల తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని పేర్కొంటూ గత నెలల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌ను కలిశారు.


తెలంగాణ తరఫున బనకచర్లకు వ్యతిరేకంగా పలు లిఖితపూర్వక అభ్యంతరాలు కేంద్రానికి సమర్పించడంతో, కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష చర్చను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. కృష్ణా-గోదావరి జలాలపై కూడ చర్చ? ....   ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదుల జలాల పంపకాలు, వాటికి సంబంధించిన ప్రాజెక్టులపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఇప్పటికీ నీటి పంపకాలపై స్పష్టత రాకపోవడం వల్ల తరచూ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి రాష్ట్రాల మధ్య అధికారి స్థాయి సమావేశం కాకుండా, ఓ ముఖ్యమంత్రి స్థాయి భేటీ జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.



పరిష్కారానికి ఈ సమావేశమే మార్గమా ? ...  ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న దృష్ట్యా, ఈ సమావేశం ఒక పాజిటివ్ మలుపు తిప్పే అవకాశం ఉన్నట్టు వర్గాలు భావిస్తున్నాయి. జలవివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్రంగా చర్చించి, పరస్పర అంగీకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. "చర్చకు సిద్ధం" అంటున్న రేవంత్ ...  ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, "గోదావరి, కృష్ణా జలాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 16న జరగనున్న సీఎం భేటీపై రాజకీయ, పాలనాపర వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ భేటీ తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు పరిష్కార దారులు తెరుచుకుంటాయా? అనేది తేలాల్సిన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: