
ఈ క్రమంలో నిమిషా ప్రియకు తక్షణ సహాయం అవసరమని భావించిన సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ , కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక దౌత్య-మధ్యవర్తిత్వ బృందం నియమించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపి, ఆమెకు క్షమాభిక్షను సాధించడమే ఈ బృందం లక్ష్యం. కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యుడు దినేష్ నాయర్ మాట్లాడుతూ – “నిమిషా చిన్న కుమార్తె, వృద్ధ తల్లి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలి. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఇది చివరి అవకాశం కావచ్చు,” అన్నారు.
పిటిషన్‌లో ప్రతిపాదించిన 6 మంది సభ్యుల బృందం లో కౌన్సిల్ ప్రతినిధులు, న్యాయ సలహాదారులు, ముస్లిం మతపండితులు, యెమెన్ సంబంధాలున్న వ్యక్తులు ఉండగా, కేంద్రం నామినేట్ చేసే ఇద్దరు అధికారుల సహకారంతో చర్చలు సాఫీగా జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాయర్ మాట్లాడుతూ – “ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాంతో బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపే మార్గం తెరుచుకుంటుంది. ఇది నిమిషా ప్రియ జీవితాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చే అవకాశం కావచ్చు,” అన్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా మానవతా ఉద్యమాలను ఊపొస్తుండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మరణశిక్ష అనేది చివరి శిక్ష అయినంత మాత్రాన, దాని వెనక ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు అంటున్నారు.