ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్లుగా ఎదగాలని కోరుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైద్య సాంకేతికత, సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎక్లాట్(ECLAT) హెల్త్ సొల్యూషన్స్ సంస్థ విజయవాడ గన్నవరం సమీపం కేసరపల్లిలోని మేధా హైటెక్ సిటీ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు మేధ టవర్స్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలో మొక్కను నాటారు. ఆరోగ్య సంరక్షణలో అమెరికాలోనే అతిపెద్ద వ్యవస్థను ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ కలిగి ఉంది. రెవెన్యూ, డేటా అనలటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యుషన్స్ లో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, ఆడిటింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్, హెచ్ సీసీ కోడింగ్, సాఫ్ట్ వేర్ ఆధారిత పరిష్కారాలలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థకు నైపుణ్యం ఉంది. 2008 ఏడాదిలో కార్తీక్ పొల్సాని ఈ సంస్థను స్థాపించారు. స్నేహ పొల్సాని నేతృత్వంలో మరింత వేగంగా కంపెనీ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా నిపుణులను ఈ సంస్థ నియమించింది. మనదేశంలోని హైదరాబాద్, కరీంనగర్, లక్నో, ముంబై నగరాల్లో కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించింది. విజయవాడలోని మేధ ఐటీ పార్క్ లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. స్థాపించిన రెండు నెలల్లోనే 300కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. వచ్చే ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.


ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఏర్పాటు విజయవాడకు గర్వకారణం
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ రోజు విజయవాడలో మెడికల్ కోడింగ్ కంపెనీ ఎక్లాట్(ECLAT) హెల్త్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుంది. అంతర్జాతీయ ఐటీ రంగంలో ఏపీ ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ముందుగా సంస్థ స్థాపకులు కార్తిక్ పోల్సాని, శ్రీమతి స్నేహ పోల్సాని గారికి హృదయపూర్వక అభినందనలు. అందరూ మెగా నగరాలపై దృష్టిసారించగా.. మీరు చిన్న నగరాలపై నమ్మకం ఉంచారు. కొద్దిమందితో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కరీంనగర్‌ను ఒక రిస్క్‌గా కాకుండా అవకాశంగా చూసి విజయవంతమయ్యారు. ఇప్పుడు అదే దృఢసంకల్పంతో విజయవాడకు వచ్చారు. ఇది కేవలం కంపెనీ ప్రారంభం మాత్రమే కాదు.. ఎంతోమంది కలల ప్రారంభం. డిజిటల్ సాధికారతకు నాంది.


ఏపీలో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్లుగా ఎదగాలని కోరుకుంటున్నాం
ప్రారంభ దశలోనే ఎక్లాట్ సంస్థ 300 ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉంది. ఏడాదిలో వెయ్యి ఉద్యోగాలకు విస్తరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. తిరుపతి, కాకినాడ, అనంతపురం, రాజమహేంద్రవరం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాలు కూడా డిజిటల్ వృద్ధికి హబ్‌లుగా మారాలి. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపూర్ కు కియాను తీసుకువచ్చాం. రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు కర్నూలు, అనంతపురానికి తీసుకువస్తున్నాం. కడప, చిత్తూరుకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చాయి. నెల్లూరుకు ఎల్జీతో డైకిన్ కంపెనీ రానుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కు అమరావతి కేంద్రం కానుంది. ఆసియాలోనే మొదటి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటుకానుంది. మనకు దార్శనిక నాయకుడు చంద్రబాబు గారు ఉండటం వరం. 20 ఏళ్ల ముందే ఆయన ఆలోచిస్తారు. ఉత్తరాంధ్రలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వాను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రకు ఇండియాలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ ఆర్సెల్లర్ మిట్టల్ రానుంది.


చంద్రబాబు గారి బ్రాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు వస్తున్నాయి
ఏపీలో భవిష్యత్ లో విస్తృత అవకాశాలు రానున్నాయి. చాలామంది అడుగుతారు.. కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు ఏముందని అడుగుతారు. నా సమాధానం ఒకటే.. మాకు చంద్రబాబు బ్రాండ్ ఉందని చెబుతాను. నేడు ఏపీకి అనేక కంపెనీలు వస్తున్నాయంటే చంద్రబాబు గారి బ్రాండే కారణం. జీడి నెల్లూరులో నేను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు బడ్డీకొట్టు నడుపుకునే ఓ మహిళను కలిశాను. ఆమె భర్త మద్యానికి బానిసై చనిపోయాడు. తన ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలని ఆమెను అడిగితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అడిగారు. ఆ ప్రభావంతోనే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంవోయూలు కుదుర్చుకోవడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంద‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: