
ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాల భూములను అభివృద్ధి చేయకుండా మళ్ళీ భూ సమీకరణ చేయడం విషయంలో రాజధాని రైతులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి వల్ల ఇబ్బంది పడిన నేతలను కంట్రోల్ చేయడం తనకు కూడా సాధ్యం కాదని జగన్ చెబుతున్నారు.
2029లో అధికారంలోకి రావడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పాదయాత్ర దిశగా అడుగులు వేయడంతో పాటు సరికొత్త హామీలతో ప్రజలకు దగ్గరవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ 40 శాతం ఓటు బ్యాంకును కలిగి ఉన్న జగన్ ఆ ఓటు బ్యాంక్ మరింత పెరిగే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని భోగట్టా.
నారా లోకేష్ సైతం గతంలో ఎదురైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. యువ నేతలను కలుపుకుంటూ ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి హిందూపురం, కుప్పం నియోజకవర్గాలు కంచుకోటలు కాగా ఆ జాబితాలో మంగళగిరిని కూడా చేర్చాలని లోకేష్ భావిస్తున్నారని సమాచారం. 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా లోకేష్ నిలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. 2029 ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వస్తాయో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.