
రాజకీయ & సినీ రంగం నుంచి విపరీత వ్యతిరేకత ..కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ తీర్పును మానవతా సూత్రాలకు విరుద్ధమని ఖండించారు. రాహుల్ గాంధీ, “వీధి కుక్కలు సమస్య కాదు, మన సమాజంలో దయకు అర్హులైన జీవులు” అని అన్నారు. ప్రియాంక గాంధీ ఈ ఆదేశాన్ని “అతి క్రూరమైనది”గా అభివర్ణించారు.సినీ తారలు కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారు. జాన్ అబ్రహామ్, రవీనా టాండన్, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ వంటి వారు వీధి కుక్కలను సమాజంలో భాగమని, తరతరాలుగా మనుషుల పక్కనే జీవిస్తున్నాయని గుర్తుచేశారు. జాన్ అబ్రహామ్, పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ అనిమల్స్ (PETA) ఇండియా గౌరవ డైరెక్టర్ హోదాలో సీజేఐకి లేఖ రాసి, ఈ తీర్పు ప్రాణుల జనన నియంత్రణ (ABC) నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
సీజేఐ కీలక నిర్ణయం .. తీవ్ర విమర్శల మధ్య సీజేఐ బి.ఆర్. గవాయి ఈ కేసును పునఃసమీక్షించడానికి త్రిసభ్య విస్తృత బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్, జంతు సంక్షేమం, పౌరుల భద్రత, పర్యావరణ సమతుల్యత అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుది తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం చూపు సుప్రీంకోర్టు వైపే. ఈ తీర్పు మారితే వీధి కుక్కలకు న్యాయం జరుగుతుందా? లేక తీర్పు అలాగే ఉంటే ఢిల్లీలో కుక్కల దృశ్యం చరిత్రలో మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.