
ముఖ్యంగా, టీడీపీతో కుదుర్చుకున్న బంధాన్ని మరింత బలపరచుకునేందుకు చంద్రబాబుకు ఒక అదనపు మంత్రి పదవి ఇవ్వాలని మోడీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ - టీడీపీ మధ్య చర్చలు జరిగి, చంద్రబాబు కూడా సీమ నుంచి ఒక ఎంపీకి అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారిలో భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ కోటాలో ఉన్నారు. టీడీపీ కోటాలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పౌర విమానాయాన శాఖ మంత్రిగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించినట్లే, ఇప్పుడు రాయలసీమకు కూడా న్యాయం చేయాలన్నదే బాబు వ్యూహంగా కనిపిస్తోంది.
సీమ నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఇద్దరు ఎంపీలు పోటీ పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా, అనంతపురం, చిత్తూరు ఎంపీలు రేసులో ఉన్నారని తెలుస్తోంది. హిందూపురం ఎంపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎక్కువ అవకాశాలు ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడికి లేదా కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి దక్కే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలా చూస్తే, రాబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమకు ప్రాధాన్యం ఇచ్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే, ప్రాంతీయ సమతౌల్యం సాధించడమే కాకుండా రాజకీయంగా కూడా టీడీపీకి అదనపు బలం చేకూరుతుంది. ఏదేమైనా, ఈ దఫా సీమకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయమని చెప్పొచ్చు.