
మాల సామాజికవర్గంలోని ఇతర ఉపకులాలకు చెందిన చదువుకున్న యువతకు ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో తీరని అన్యాయం జరుగుతోందని మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, ప్రెసిడెంట్ చెరుకు రామ్ చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఎంపెరికల్ డేటా తీసుకోకుండా, అన్ని వర్గాలతో చర్చించకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేపట్టి 58 ఉప కులాల గొంతు కోశారని దుయ్యబట్టారు. గత ఆరు నెలల ఉద్యోగ నియామకాల్లో ఇదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను పట్టించుకోవాలని ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో, ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో జిల్లాల వారీగా 200 మంది మాల సామాజికవర్గంలోని ఉప కులాలకు చెందిన యువతను రంగంలోకి దింపి, వారితో నామినేషన్లు వేయిస్తామని వివరించారు.
నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో మాల సామాజిక వర్గం నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు ఉప ఎన్నికను మరింత వేడెక్కించాయి. జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే పది మంది ఇండిపెండెంట్లు, చిన్నచితకా పార్టీల నుంచి మరో ఏడెనిమిది మంది నామినేషన్లు వేయనున్నారు. ఇటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కూడా విజయం కోసం హోరాహోరీగా పోరాడుతున్న తరుణంలో, మాల జేఏసీ ఉమ్మడి నామినేషన్ల నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారనుంది. ఇది కాంగ్రెస్ ఓట్లను చీల్చి, ఎన్నికల ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిరసన నిర్ణయం ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండనుందో అనే ఉత్కంఠను పెంచింది.