ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోందని వార్త‌లు వ‌స్తున్నాయి. పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకూ ఆయన వైసీపీలోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన, ఓడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో డిపాజిట్ కాపాడుకున్న ఏకైక నేతగా నిలిచారు. అప్పటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగ‌జారుతోంది. ప్రస్తుతం ఉన్న‌ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీలో కూడా చాలా మంది నాయకులు నిరాశకు గురై, బయటకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్‌లో కొనసాగడంలో ప్రయోజనం లేదని భావిస్తున్నట్లు సమాచారం.


మొదట ఆయన జనసేనలో చేరాలనే ఆలోచనలో ఉన్నా... చీరాల నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో టిడిపి బలమైన కేడర్ కలిగి ఉండడం, అలాగే జనసేనలో టికెట్ దొరుకుతుందో లేదో అనుమానం రావడం వల్ల ఆమంచి వైసీపీ మ‌న‌సు వైసీపీ వైపు లాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన మళ్లీ గతంలో వదిలేసిన వైసీపీలో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు కూడా ఆయన రాకపై సానుకూలంగా ఉన్నారని సమాచారం. పార్టీకి చీరాలలో బలమైన నాయకత్వం అవసరమని, ఆమంచి కృష్ణమోహన్ వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ఉంటే జనసేన - టిడిపి కూటమిని బలంగా ఎదుర్కోవచ్చని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.


ఇక చీరాల వైసీపీ నేత కరణం బలరాం కృష్ణమూర్తి పార్టీలోనే కొన‌సాగితే .. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌ను అద్దంకికి మార్చాల‌న్న టాక్ ఉంద‌ని వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. వైసీపీ ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్‌కు ఆహ్వానం పంపేందుకు సిద్ధమైందని, త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇది జరిగితే చీరాల రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ రీ-ఎంట్రీతో వైసీపీ మళ్లీ చీరాలో పట్టు సాధించే అవకాశం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: