అవును నిజం! ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంపు అత్యంత కీలక సవాల్‌గా మారింది. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి రూ. 100 ఖర్చు అవుతున్నా, అందుతున్న వాస్తవ ఆదాయం కేవలం రూ. 35 నుండి రూ. 55 మధ్యే ఉందనేది అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ ఆర్థిక అసమతుల్యతను సరిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఆదాయ వనరులను పెంచడం, వ్యయ నియంత్రణతో పాటు కొత్త మార్గాల అన్వేషణలో సీఎం తలమునకలై ఉన్నారు. అయితే ఈ ప్రక్రియలో మూడు ప్రధాన సమస్యలు ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తున్నాయి.


1. ప్రజలపై భారంలేకుండా ఆదాయం పెంపు .. గత వైసీపీ పాలనలో చెత్తపై కూడా పన్నులు విధించి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ఘటన అందరికీ తెలిసిందే. అదే తప్పు పునరావృతం కాకూడదని చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. ప్రజలపై కొత్త పన్నులు వేయడం లేదా మద్యం ధరలను పెంచడం ద్వారా ఆదాయం రాబట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. “ప్రజల జేబుకి భారమయ్యే నిర్ణయాలు కాదు, వ్యూహాత్మక మార్గాల ద్వారా ఆదాయం పెంచాలి” అనే స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.



2. పన్నుల పెంపు విషయంలో జాగ్రత్తలు .. ప్రస్తుతం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను ఒకసారి పెంచింది. తిరిగి పెంపు చేస్తే ఆస్తి కొనుగోళ్లు మందగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. అలాగే వాహనాలు, ప్రాపర్టీ, బిజినెస్ లైసెన్సులపై అదనపు పన్నులు విధించడం కూడా ఆలోచనలో ఉన్నా, ప్రజా వ్యతిరేకత భయంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.



3. సేవా రుసుముల పెంపు కూడా నిలిపివేత .. మునిసిపాలిటీల్లో ఇప్పటికే సేవా రుసుములు వసూలవుతున్న నేపథ్యంలో, వాటిని మరింతగా పెంచితే ప్రజల అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.



మంత్రుల కమీటీ యాక్షన్‌లోకి! నారాయణ, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌లతో కూడిన ఈ కమిటీ ప్రస్తుతం జిల్లాల వారీగా ఆదాయ వనరులను గుర్తిస్తోంది. ప్రభుత్వ ఆస్తుల సద్వినియోగం, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు, పరిశ్రమల ప్రోత్సాహం, రోడ్లు–ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెంపు వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. లక్ష్యం - కనీసం 20% ఆదాయ పెంపు! మంత్రుల కమిటీ సూచనల ఆధారంగా ప్రస్తుత రాష్ట్ర ఆదాయాన్ని కనీసం 20 శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంపు — ఇదే చంద్రబాబు కొత్త ఆర్థిక వ్యూహానికి మూలమంత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: