
మ్యాచ్ ముగిసిన వెంటనే గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా చిన్న కొడుకు స్టాండ్స్‌లో వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కలిచివేసింది. చుట్టూ ఉన్నవారు ఎంత ఓదార్చినా అతని కన్నీళ్లు ఆగలేదు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి, షాహనీల్ కూడా కన్నీటిపర్యంతమైంది. పక్కనున్న వారు ఆమెను ఓదార్చాల్సి వచ్చింది. ఆటగాళ్ల ఆప్తుల ముఖాల్లో ఎలిమినేషన్ బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది.
నిజానికి, ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన అద్భుతంగానే ఉంది. లీగ్ దశలో చాలా కాలం పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగారు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి రెండు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లలో వరుస ఓటములు వారిని ఎలిమినేటర్ రౌండ్‌లోకి నెట్టేశాయి. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ చేతిలో మూడో వరుస ఓటమితో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్రయాణం ముగిసింది.
ఈ కీలక మ్యాచ్‌లో, టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఫీల్డింగ్‌లో గుజరాత్ టైటాన్స్ చేసిన ఘోర తప్పిదాలు మ్యాచ్‌ను మలుపుతిప్పాయి. రోహిత్ శర్మకు రెండుసార్లు జీవనదానం లభించింది. ఒకసారి గెరాల్డ్ కోయెట్జీ, మరోసారి కుశాల్ మెండిస్ క్యాచ్ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులతో చెలరేగాడు. అతనికి జానీ బెయిర్‌స్టో (47 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబైకి బలమైన పునాది వేశారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. సాయి సుదర్శన్ (80 రన్స్), వాషింగ్టన్ సుందర్ (48 రన్స్) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, గుజరాత్ లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.