ప్రతి ఒక్కరికీ తమ జీవిత ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు పరిచయమవుతారు. అలా పరిచయమైన వారిలో కొందరు మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అలా ఒకసారి పరిచయమైతే జీవితంలో మరిచిపోలేని వ్యక్తులలో కోటిరెడ్డి సరిపల్లి ఒకరు. మారుతున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే అరుదైన వ్యక్తిత్వం ఉన్నవారు కోటిరెడ్డి. సామాన్య కుటుంబంలో జన్మించిన కోటిరెడ్డి నేడు వేల కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారు. 
 
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్ధనపురంకు చెందిన కోటిరెడ్డి పదో తరగతి అర్హతతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించారు. ఆయన తెలుగు వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయం. 750 రూపాయల సంపాదనతో కెరీర్ మొదలుపెట్టి 1100 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలకు అధిపతి అయ్యారు. నేటి యువతకు ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచారు. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో పదేళ్లు ఉద్యోగం చేసి పుట్టిన దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్షతో స్వదేశానికి వచ్చారు. 
 
2014 సంవత్సరంలో కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ను స్థాపించి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ సేవలందించేందుకు కంపెనీలను స్థాపించారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కోటిరెడ్డి సంపాదనలో 33 శాతం సేవ కోసం వినియోగిస్తున్నారు. మానవత్వానికి మరో రూపంలా నిలుస్తున్నారు. సేవా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించిన కోటిరెడ్డి ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వయో వృద్ధులకు సేవలందిస్తున్నారు. 
 
కృష్ణా జిల్లాలోని జనార్ధనపురం, నందివాడల్లోని పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ లు అందిస్తున్నారు. ప్రతిభ, పట్టుదల ఉంటే జీవితంలో సక్సెస్ సాధిస్తారని చెప్పటానికి కోటిరెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ. నేడు ఆయన పుట్టినరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: