ఇరాన్ దూకుడు తగ్గించేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోకపోతే అంతర్జాయతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదముందని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు.ఇరాన్‌ను అదుపులో పెట్టడంలో విఫలమైతే ఆ దేశం మరింత పేట్రేగుతుందని, అది యుద్ధానికి కూడా దారి తీయొచ్చని ఆయన అన్నారు. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముందనీ అన్నారు.


సౌదీలోని చమురు కేంద్రాలు, క్షేత్రాలపై బాంబు దాడుల నేపథ్యంలో ఆయన ఇరాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యలపై ఇరాన్ ''ఆయన మాటలతో సౌదీ అరేబియాకు అవమానం కలగడం తప్ప వేరే ఫలితం లేదు'' అంటూ స్పందించింది.ఇటీవల సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్ దాడులలో తమ ప్రమేయం లేదని ఇరాన్ చెబుతోంది. ఈ దాడులతో ప్రపంచంలో 5 శాతం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడి ఇప్పటికే ధరలు పెరిగాయి.


ప్రపంచ దేశాలు ఇరాన్‌ను అదుపులో పెట్టకపోతే మున్ముందు చమురు విషయంలో మరిన్ని కష్టాలు తప్పవని సల్మాన్ హెచ్చరిస్తున్నారు.''చమురు సరఫరా పూర్తిగా దెబ్బతింటుంది. జీవితంలో ఎన్నడూ చూడని స్థాయికి చమురు ధరలు పెరిగిపోతాయి'' అని ఆయన హెచ్చరించారు.ప్రపంచ ఇంధన అవసరాల్లో 30 శాతాన్ని మధ్యప్రాచ్యమే తీరుస్తోందని.. ప్రపంచ వాణిజ్యంలో 20 శాతం మధ్యప్రాచ్యం మీదుగానే జరుగుతోందని.. ప్రపంచ జీడీపీలో 4 శాతం వాటా ఈ ప్రాంతం నుంచే ఉందని ఆయన అన్నారు


ఈ మూడు అంశాలకూ ఇబ్బంది కలిగితే కేవలం సౌదీకో, లేదంటే మధ్య ప్రాచ్య దేశాలకో నష్టం కలగదు. ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుతుందన్నారాయన.తమ దేశంలోని రెండు చమురు కేంద్రాలపై సెప్టెంబరు 14న 18 డ్రోన్లు, 7 క్రూయిజ్ మిసైళ్లతో దాడులు చేశారని సౌదీ ఆరోపిస్తోంది.యెమెన్‌లోని ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులకు తామే కారణమని ప్రకటించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: