బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ కోతలు అనధికారికంగా విధిస్తుండటం, వాటి వేళలు ఎక్కువ అవుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నగరాల్లో ఇన్వర్టర్ల మార్కెట్‌ పుంజుకుంది. నిజానికి ఆధునిక సమాజంలో విద్యుత్ ఓ నిత్యావసరంగా్ మారింది. దీనికితోడు రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగులు రాష్ట్రంగా మారడం.. అటు కేంద్రం కూడా 24 గంటలు పవర్ ఇచ్చే రాష్ట్రాల జాబితాలో చేర్చి పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభిచడంతో రాష్ట్ర ప్రజలు పవర్ కట్ అనే మాటే మరిచిపోయారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవర్ పర్చేజింగ్ ఎగ్రిమెంట్లను సమీక్షిస్తామని చెప్పడంతో పాటు రాష్ట్రంలోని కొన్ని థర్మల్  ప్లాంట్‌లను మూయించేయడంతో ఉత్పత్తి మందగించింది. దీనికి తోడు గత కొంతకాలంగా బొగ్గు కొరత ఏర్పడటంతో ఈ సమస్య రెట్టింపు అయింది. అటు తెలంగాణలోని సింగరేణి గనుల నుంచి వచ్చే బొగ్గుకు డబ్బు చెల్లించకపోవడంతో అది కాస్తా నిలిచిపోయింది. దీంతో రోజూ అటు విద్యుదుత్పత్తి, ఇటు వినియోగం మధ్య 30 మిలియన్ యూనిట్లు మేర కొరత ఏర్పడుతోంది.

ఇదిలావుంటే, ఇప్పటికే ఎండలు ముదురుతుండటంతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో లోడ్ రిలీఫ్ పేరుతో ఇప్పటికే గ్రామాల్లో ఐదు గంటలపాటు పవర్ కట్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. దసరా తర్వాత పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలు పవర్ కట్‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. పవర్ కట్‌ను నిరోధించేందుకు ఇన్వర్టర్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ఇన్వెర్టర్, బ్యాటరీలు సరఫరా చేసే కంపెనీలు, షాపుల యజమానులు వీటి ధరను అమాంతంగా పెంచేశారు. అయితే ప్రస్తుతానికి వీటి ధర ఓల్డ్ స్టాక్ మూలంగా యథావిధిగా ఉందని, కానీ విద్యుత్‌ కోతలుపెరిగే కొద్ది ఇన్వర్టర్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందనీ షాపు యజమానులు అంటున్నారు. మొత్తంమీద విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తుందన్న ప్రచారం నేపధ్యంలో గృహ వినియోగదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. గృహాల్లో ఇన్వర్టర్‌లు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: