ఇంత బతుకు బతుకి ఇంటి వెనుక చావడం అంటే ఇదే.. అందుకే విధిని అంతా నమ్ముతారు.. అతడో క్రిమినల్.. నేరాల్లో మాస్టర్ మైండ్.. నేరం అంటే కత్తి పట్టుకుని కుత్తుకులు కోసే టైపు కాదు.. వైట్ కాలర్ నేరాల్లో ఆయన దిట్ట. జనానికి ఉన్న డబ్బు ఆశలు సొమ్ము చేసుకోవడంలో అతగాడు మహా ముదురు. ఇంతకీ అతని పేరేంటో చెప్పలేదు కదా. మనోడి పేరు ప్రభాకరన్.

 

 

పేరును చూస్తేనే అర్థమైపోతోందిగా మనోడు తమిళుడని.. దాదాపు పదేళ్ల క్రితం ప్రభాకరన్ తమిళనాడులో మనీ బ్యాక్ పేరుతో ఓ స్కీమ్ పెట్టాడు. తక్కువ సొమ్ము కట్టండి.. ఎక్కువ సొమ్ము పొందండి అంటూ ప్రజలను ఊరించాడు. కార్పోరేట్ బిల్డప్పుతో ఆఫీసులు తెరిచాడు. ఇక జనం అతడి స్కీముకు ఎగబడ్డారు. అలా ఒకటా రెండా ఏకంగా 500 కోట్లరూపాయలు పోగేసుకుని బోర్డు తిప్పేశాడు ప్రభాకరన్.

 

 

కానీ చట్టం చేతులు పెద్దవి కదా. మొత్తానికి పోలీసులు 2012లో ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనకు ఓ భార్య. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు అరెస్టయిన ఏడాదికి ఆయన భార్య సుకన్య కూడా ఇదే కేసులో అరెస్టయింది. పిల్లలు ప్రభాకరన్ తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నారు. ప్రభాకరన్, సుకన్య ఇద్దరు వేరు వేరుగా జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రభాకరన్ ఇక తమిళనాడులో బతకలేనంటూ హైదరాబాద్ వచ్చి మల్కాజ్ గిరీలో ఉండటం ప్రారంభించాడు.

 

 

ఆ తర్వాత విడుదలైన సుకన్య భర్త ఆచూకీ తెలుసుకుని పిల్లలను తీసుకుని హైదరాబాద్ వచ్చింది. భర్త దగ్గరే ఉందామనుకుంది. కానీ ఎందుకనో భర్త ప్రభాకరన్ ఆమెతో ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో అసలే జైళ్లో క్రిమినల్స్ మధ్య ఉండి వచ్చిన సుకన్య కోపంతో భర్త ముఖంపై దిండుతో నొక్కి చంపేసింది. తర్వాత నిద్రలో చనిపోయాడని చెప్పినా పోలీసులు గుట్టు కనిపెట్టేశారు.దాంతో సుకన్య మరోసారి జైలు పాలైంది. మొత్తానికి ఒకప్పుడు 500 కోట్లు కొట్టేసిన ప్రభాకర్ చివరకు సొంత పెళ్లాం చేతిలోనే కుక్కచావు చచ్చాడు. అదీ విధి అంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: