దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక, నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక ఎక్కడపడితే అక్కడ పిట్టలా ప్రాణాలు కోల్పోతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు శవమయ్యాడు. పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు కన్నుమూశాడు. కరోనా మహమ్మారికి బలైపోయాడు. ఊహించని ఈ విషాదంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.  విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సాలూరు మండలంలోని కురుకుట్టి గ్రామానికి చెందిన చిన్నపాత్రుని మనోహర్ (22) ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమయింది. మే 23న వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. కానీ అంతలోనే మనోహర్‌కు జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అసలే కరోనా టైమ్.. పైగా జ్వరం తగ్గకపోవడంతో.. అతడికి అనుమానం వచ్చి పీహెచ్‌సీయూలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు.

అయితే మనోహర్ భయపడినట్లుగానే పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. స్పల్ప లక్షణాలే ఉన్నాయి కదా.. నేను ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉంటానని డాక్టర్లకు చెప్పాడు. ఐతే ఆక్సిజన్ శాతం ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉండడంతో... ఆస్పత్రిలో చేరితేనే మంచిదని డాక్టర్లు సూచించారు. అనంతరం వైద్య చికిత్స కోసం బొబ్బిలి ఆస్పత్రికి రెఫర్ చేశారు

 ఆ తర్వాత మనోహర్‌ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆక్సిజన్ స్థాయులు బాగా తగ్గిపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టమైంది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మనోహర్ కన్నుమూశాడు. మనోహర్ మృతితో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: