ఎవరు ఔనన్నా, కాదన్నా.. ఏపీ ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఆ మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా పడ్డాయి, పెన్షనర్లు కూడా రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడా పరిస్థితి లేదు కానీ.. ఏనెలకానెల జీతాలకు కూడా వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదే సమయంలో ఎక్కడా సంక్షేమ పథకాలకు మాత్రం లోటు లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు రెండ్రోజులు జీతం ఆలస్యం కావొచ్చేమో కానీ, సామాజిక పింఛన్లు తీసుకుంటున్నవారికి మాత్రం ఠంచనుగా ఫస్ట్ తేదీ వాలంటీర్లు ఇంటికెళ్లి మరీ డబ్బులు చేతిలో పెట్టి వస్తున్నారు.

ఇంకెన్నాళ్లీ బాధలు..
ఏపీ అప్పుల్లో ఉంది, ఏపీని అప్పుల్లెకి నెట్టేశారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీపై నింద వేయాలని చూసినా, కేంద్రం మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుందని సర్దిచెప్పుకున్నా.. కుదిరేలా లేదు. ఏపీ అప్పుల్ని చంద్రబాబు ప్రధానంగా హైలెట్ చేస్తున్నారు, ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికలనాటికి బలంగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఆ లోగా అప్పుల తిప్పలు తప్పించుకోడానికి జగన్ సర్కారు కూడా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి.

పెరిగిన కరెంటు చార్జీలు..
సర్దుబాటు పేరుతో కరెంటు చార్జీలను విపరీతంగా పెంచడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో వాడిన కరెంటుకి కూడా ఇప్పుడు బిల్లులు చెల్లించాలనే సరికి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. చెత్త పన్నుతో మున్సిపాల్టీల ఆదాయం పెంచుకోవాలని చూడటం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది.

ఆర్థిక సాయంలో అనర్హుల ఏరివేత..
సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం నిధులు కేటాయిచాల్సి రావడంతో.. సామాజిక పింఛన్ల విషయంలో జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు. దీంతో చాలామంది అనర్హులుగా మారి పింఛన్లు కోల్పోతున్నారు. ఇలాంటి వారందరూ ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమకు పింఛన్లు తొలగించారని, ఫలానా పథకానికి తమను అనర్హులుగా చేశారంటూ ఆడిపోసుకుంటున్నారు.

మౌలిక వసతుల సంగతేంటి..?
కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టడంతో.. రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై కూడా వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇలాంటి అవసరాలకయినా అప్పులు తెచ్చుకుని ఖర్చు చేయాలి, కానీ ఇప్పటికే సంక్షేమ పథకాలకు కేటాయింపులు పూర్తి కావడంతో ఆ సాహసం చేయలేకపోతున్నారు. దీంతో సహజంగానే జనాల్లో అసంతృప్తి పెరిగే అవకాశముంది. అప్పుల ఊబిలోనుంచి బయటపడే క్రమంలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: