ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం సంగతేమో కానీ.. దాని ప్రభావంతో ఇండియాలో అనేక వస్తువుల రేట్లు మండిపోతున్నాయి. ప్రత్యేకించి వంటింట్లో చమురు బాంబు పేలుతోంది. వంట నూనెల ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో పాటు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేసియా నిషేధం విధించడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. కారణం ఏమైతేనేం.. వంటింట్లో మాత్రం మంటలు రేగుతున్నాయి. అందుకే ప్రజలకు కాస్త  ఉపశమనం కల్పించేందుకు కేంద్రం ఆలోచిస్తోందట.  కొన్ని వంట నూనెలపై పన్నులు తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తోందట.


ప్రత్యేకించి ముడి పామాయిల్ దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ ను తగ్గించాలని కేంద్రం భావిస్తోందట. వీటిని  5శాతం నుంచి తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. తుది నిర్ణయం రాలేదు. దీనిపై ఆర్థిక, వ్యవసాయ, ఆహార శాఖలు కూడా స్పందించాల్సి ఉందట. అయితే.. ముడి పామాయిల్ పై బేస్ దిగుమతి సుంకాన్ని ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే.


అయితే ఈ చర్యలు వంటనూనెల ధరలను తగ్గిస్తాయా అన్నది పూర్తిగా నమ్మకంగా చెప్పలేం. ఎందుకంటే.. గతంలో పామ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించారు. నిల్వలపై ఆంక్షలు కూడా విధించారు. కానీ... వాటి ధరలను అదుపు చేయటం సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు కనోలా, ఆలివ్, రైస్ బ్రాన్, పామ్ కెర్నల్ తదితర ముడినూనెల దిగుమతి సుంకాలను 35 శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తోందట.


ఫలితం వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు పన్నులు తగ్గిస్తే.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించుకోవచ్చు. అసలే సామాన్యుడి అన్నిటిపైనా బాదుడు ఎక్కువైంది. కాస్త ప్రభుత్వాలు ఈ విషయంలో కనికరించకపోతే.. అసలుకే మోసం వస్తుంది. మరి సామాన్యుడి బావుంటేనే కదా.. ప్రభుత్వాలకు ఆదాయం.. పరిమితిని మించి పిండేస్తే ఎలా అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: