కొన్ని నెలలుగా తెలంగాణలో బీజేపీ జోరు మీద ఉంది.. ప్రత్యేకించి బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ మంచి ఊపు మీద ఉంది. దీనికి తోడు ఆ పార్టీలోకి చేరికల జోరు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అన్న చర్చ కూడా మొదలవడం విశేషం. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ చర్చ సాగుతోంది.


తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణంగా బండి సంజయ్ కుమార్‌ను చెప్పుకోవచ్చు. ఆయన రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాకనే పార్టీకి జోష్ వచ్చింది. కేసీఆర్‌కు దీటుగా మాటల మంటలు పుట్టించడంలో బండి సంజయ్ సిద్ధ హస్తుడు. ఆయన స్వయంగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలవడం.. అదే సమయంలో పార్టీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడం.. ఆ తర్వాత దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ గెలవడం బండి సంజయ్ నాయకత్వానికి జోష్ తెచ్చాయి.


అయితే.. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌ పార్టీకి మరింత జోష్ తెచ్చారు. అయితే పార్టీలోకి వచ్చే ముందే.. ఈటల కొన్ని షరతులతో వచ్చాడని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈటల ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఆ షరతుతోనే ఆయన పార్టీలోకి వచ్చారని కూడా వాదనలు ఉన్నాయి. దీనికితోడు ఈటల కేసీఆర్‌ను సవాల్ చేసి మరీ హుజూరాబాద్ లో గెలవడం కూడా ఆయన ప్రతిష్టను పెంచింది.


ఈ నేపథ్యంలో కాబోయే సీఎం ఈటల రాజేందరే అన్న ప్రచారం బీజేపీలో ఓ వర్గం చేస్తోంది. అయితే అప్పుడే సీఎం అభ్యర్థి ఎవరనే ప్రచారం జరగడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈటల రాజేందర్ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాను సీఎం అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. తమ కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని.. పదవులు వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP