ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు శర వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుతో దూకుడు కనబరుస్తుండగా.. వైనాట్ 175 అనే నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ తో పాటు బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికల ముంగిట రాజకీయ ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని తగిన వ్యూహాలు రచిస్తున్నాయి.


తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. దీంతో ఇప్పుడు చూపంతా ఏపీ వైపు మళ్లింది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ని ప్రభావితం చేయకపోయినా కొన్ని అంశాలను మాత్రం జగన్ పట్టించుకోవాలి. లేకపోతే కేసీఆర్ మాదిరిగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏమంత వ్యతిరేకత లేదు. అనేక ప్రజాకర్షక సంక్షేమ పథకాలు అమలు చేసింది కూడా. అలాగే జగన్ కూడా ఏపీలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తూ ఆయా వర్గాలను ఆకట్టుకుంటున్నారు.


కాకపోతే బీఆర్ఎస్ అధినేత ప్రజలను కలకవపోవడమే ఆ పార్టీకి మైనస్ గా మారింది. దీంతో కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగింది. ద్వీతీయ శ్రేణి నాయకులు కూడా తమకు ప్రాధాన్యం లేదని కొంత అసంతృప్తికి గురయ్యారు. వెరసి తెలంగాణలో ఆ పార్టీ పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ పాదయాత్ర సమయంలో నేరుగా ప్రజలను కార్యకర్తలను కలిశారు. వారితో మాట్లాడారు.


ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల పార్టీపై దృష్టి సారించలేకపోతున్నారు. పార్టీ బలోపేతంపై కేవలం సమీక్షలకే పరిమితం అవుతున్నారు తప్ప కార్యకర్తలు, నాయకులతో మమేకం కావడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో ఒక గంటపాటు స్థానిక నేతలతో సమావేశం నిర్వహించేవారు. వారిని ఆప్యాయంగా పలకరించేవారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా కూడా వైఎస్ ఆర్ కోసం పనిచేసేవారు.  ఇప్పుడు జగన్ కూడా కార్యకర్తలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారిపై నిర్లక్ష్యం వహించి భారమంతా ఎమ్మెల్యేలపై వేస్తే కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: