నరేంద్ర మోడీ దేశంలో తిరుగులేని శక్తిగా మారారు. తన పదేళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లానని చెప్పుకుంటున్నారు. ఇక ఆ విషయం ఎంత వరకూ వాస్తవం అన్నది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఏ విషయం ఎలా ఉన్నా.. గత కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే.. బీజేపీ హయాంలో అవినీతి అన్నది తక్కువనే చెప్పాలి. అవినీతి లేదా అంటే.. ఉన్నా.. అది కాంగ్రెస్ పాలన తరహాలో పాపులర్ కాలేదు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో వచ్చినట్టు 2జీస్కామ్‌, బొగ్గు స్కామ్‌ వంటి వరుస స్కామ్‌లు మోదీ హయాంలో కనిపంచలేదనే చెప్పాలి.


మరి అలాగని మోదీ హయాం అంతా నీతిమయం అని చెప్పే ధైర్యం చేయలేం. బీజేపీ కూడా ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. విలువలు అంటూ మడికట్టుకోవడం అన్నది ఇప్పుడు బీజేపీలోనూ లేదు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సామాజిక సేవ బ్యాక్‌ గ్రౌండ్‌తో వచ్చిన  మాజీ ఐఆర్ఎస్‌ అధికారి అరవింద్ కేజ్రీవాల్‌ అనూహ్యంగా ఆప్‌ పార్టీ స్థాపించి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్నారు.


ఒకసారి కాదు వరుసగా రెండు సార్లు ఢిల్లీని కేజ్రీవాల్ హస్తగతం చేసుకున్నారు. అంతే కాదు.. తన పాలనతోనూ ఆయన మంచి మార్కులు సంపాదించుకున్నారు. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ ఆయన పార్టీ అధికారం సాధించగలిగింది. దీంతో ఆప్‌ ఎప్పటికైనా ప్రమాదం అని భావించిన బీజేపీ పెద్దలు.. ఆయనపై డేగ కన్ను వేశారు. తమ పెంపుడు కుక్కలు, పెరటి చిలకలుగా పేరున్న ఈడీ, సీబీఐలను రంగంలోకి దింపేశారు. చివరకు మద్యం స్కామ్‌లో నిందితుడిగా చేర్చి.. చివరకు ఊచల వెనక్కు పంపారు.


అయితే.. అవినీతిపై తగ్గేదే లేదంటూ ముఖ్యమంత్రిని కూడా ఊచల వెనక్కు పంపిన మోదీ సర్కారు.. కర్ణాటకలో మాత్రం అవినీతి సామ్రాట్టుగా పేరు గాంచిన గాలి జనార్థన రెడ్డిని మళ్లీ పార్టీలోకి రెడ్‌ కార్పెట్ పరిచి ఆహ్వానించింది. సచ్చీలుడుగా పేరున్న అరవింద్‌ కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలోనే అవినీతి రారాజుగా పేరున్న గాలి జనార్ధన్‌ రెడ్డి బీజేపీలో చేరడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: