ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఈ సారి సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి సారించారు. ఓ వైపు సీఎం జగన్ కుప్పంలో ప్రతిపక్ష నేతను ఓడించి.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని సరికొత్త ఎత్తులను వేస్తున్న క్రమంలో చంద్రబాబు కుప్పాన్ని చుట్టేస్తున్నారు. ఈ సారి భారీ మెజార్టీయే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.


అందులో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతానంటూ వారిలో జోష్ నింపారు. కుప్పం నుంచి తన గెలుపును మరోసారి రెన్యూవల్ చేయాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.


పింఛన్లు ఆపేస్తానని ఎవరూ బెదిరించినా పట్టించుకోవద్దని మహిళలకు సూచించారు. కుప్పం.. ఇక్కడి ప్రజలను జీవితంలో మరిచిపోలేనని నేను ప్రచారానికి రాకపోయినా ఇక్కడి ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చామని.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించి, ఆస్తి హక్కు కల్పించిన పార్టీ టీడీపీయేనని గుర్తు చేశారు. మహిళలను పైకి తెచ్చేందుకు ఇంటికి రెండు ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారని.. కానీ ఇప్పుడు పాడి పరిశ్రమతో కుప్పం ఆర్థిక స్థితి గతులు మారిపోయాయని తెలిపారు.

 
ఈ క్రమంలోనే కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పం అభివృద్ధికి ప్రత్యేక అజెండా రూపొందించి.. అధికారంలోకి రాగానే దానిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  కుప్పంపై కక్ష సాధింపుతో పాటు అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీకి ఎన్నికల్లో డిపాజిల్లు రాకుండా చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కుప్పం పట్టణానికి రూ.100 కోట్లు కేటాయించి శాటిలైట్ టౌన్ షిప్ గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బెంగళూరు ఎలక్ర్టానిక్ సిటీ నుంచి కుప్పం వరకు నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి కృషి  చేస్తానని.. కోలార్-కృష్ణగిరి, రామకుప్పం-ఆంబూరు రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని.. కార్గో విమానాశ్రయం కలను సాకారం చేసి రైతులను ఆదుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: