చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యారు. నాలుగో విడత ఆయన సీఎంగా వారం రోజుల క్రితం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారం రోజుల్లో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో పాలన మారిన తర్వాత జనంలో మళ్లీ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. సీఎం కావడంతోనే చంద్రబాబు ఐదు కీలక ఫైళ్లపై మొదటి రోజే సంతకాలు చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు జనంలో సానుకూల ప్రభావం చూపుతున్నాయి.


తొలి రోజే నిరుద్యోగుల ఆశలకు తగ్గట్టుగా మెగా డీఎస్సీ ప్రకటించారు. ఏకంగా 16 వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించారు. ప్రజల్లో అనేక భయాందోళనలు ఉన్న ల్యాండ్ టైట్లింగ్‌ యాక్టును రద్దు చేశారు. ఫించన్లు ఏకంగా రూ. 4 వేలకు పెంచేశారు. అంతే కాదు.. పాత బాకీతో కలుపుకుని వచ్చే నెల ఏకంగా రూ. 7 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా అన్న క్యాంటీన్ల ఫైలుపైనా సంతకం చేశారు.


ఇక చంద్రబాబు సీఎం కాగానే అమరావతికి కొత్త కళ వచ్చేసింది. రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభం అయ్యాయి. అలాగే కొత్త మంత్రివర్గం శాఖల కేటాయింపులోనూ సమన్వయం కనిపించింది. మంత్రి వర్గంలో ఏకంగా 17 మంది కొత్తవారికి పదవులు ఇచ్చినా.. టీడీపీలో పెద్దగా అసంతృప్తి కనిపించ లేదు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిలో చక్కటి సమన్వయం, సుహృద్భావ వాతావరణం కనిపిస్తున్నాయి.


దీనికితోడు చంద్రబాబు తొలి క్షేత్ర పర్యటనే పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించి ఆ ప్రాజెక్టుపై ఆశలు రేపారు. ఎలాగూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. వీలైనంత వరకూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇలా చంద్రబాబు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అన్నీ శుభ శకునములే అన్నట్టుగా పాలన సాగుతుంది. మరి ఆరంభం అదిరింది.. ఇదే తరహాలో పాలన ఎంత కాలం కొనసాగిస్తారన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: